మోదీజీ.. వర్ధిల్లు నూరేళ్లు

మోదీజీ.. వర్ధిల్లు నూరేళ్లు

నెహ్రూ రికార్డును బద్దలు
అత్యధిక కాలం ప్రధానిగా మోదీ
మీనాక్షి నటరాజన్ వ్యవహారం ఎన్నికల కమిషన్ పరిధిలోనిది
మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్, ఆంధ్రప్రభ: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ సుదీర్ఘకాలం పనిచేసి, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రధానిగా మోదీ 4,398 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాశక్తి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

దేశాన్ని ప్రపంచంలోనే ‘విశ్వగురు’ స్థానంలో నిలబెట్టే వరకు ప్రధాని మోదీ విశ్రమించబోరని బండి సంజయ్ స్పష్టం చేశారు. రాబోయే 2047 సంవత్సరం వరకు నరేంద్ర మోదీనే భారత ప్రధానమంత్రిగా కొనసాగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశాన్ని అభివృద్ధిలో ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా తీర్చిదిద్దేందుకు ఆయన శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని కొనియాడారు.

గతంలో నెహ్రూ పాలనలో అవినీతి, అరాచకాలు, బంధుప్రీతి రాజ్యమేలాయని.. దానికి భిన్నంగా మోదీ ఎలాంటి అవినీతి, పక్షపాతానికి తావులేకుండా నిజాయితీ, నిబద్ధతతో పారదర్శక పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలోని 12 ఏళ్ల పాలనలో దేశంలో సుమారు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని వెల్లడించారు. రోడ్లు, రైల్వే, ఎయిర్‌వేస్, టెలికమ్యూనికేషన్ రంగాల్లో దేశం అనూహ్యమైన ప్రగతిని సాధించిందన్నారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తూ, సమాజంలోని అట్టడుగున ఉన్న చిట్టచివరి వ్యక్తికి సైతం అవినీతి లేకుండా సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత మోదీకే దక్కుతుందన్నారు.

ఎన్నికల కమిషన్ పరిధిలోనే మీనాక్షి వ్యవహారం:

కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ పత్రాల తిరస్కరణ వ్యవహారంపై మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు. ఈ అంశం పూర్తిగా ఎన్నికల కమిషన్ (ECI) పరిధిలోనిదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని, ఈ వ్యవహారాన్ని ఈసీనే చూసుకుంటుందని బండి సంజయ్ వెల్లడించారు.