Godavarikhani ప్రజాస్వామ్య విరుద్ధంగా బీజేపీ కుట్రలు

Godavarikhani ప్రజాస్వామ్య విరుద్ధంగా బీజేపీ కుట్రలు

  • ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఒక దొంగదారి చర్య..
  • ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష ప్రభుత్వాలే లక్ష్యం..
  • బీహార్, బెంగాల్ లాగే తెలంగాణపై దృష్టి..
  • రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

గోదావరిఖని (Godavarikhani), ఆంధ్రప్రభ:

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్ష పార్టీలను, ప్రతిపక్ష ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకొని ప్రజాస్వామ్య విరుద్ధంగా కుట్రలకు తెరలేపిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. ఆదివారం ఎన్ టీపీసీలో టీ పీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన శిక్షణ శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పార్టీలను, ప్రతిపక్ష ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ ప్రజాస్వామ్య విరుద్ధమైన కుట్రలకు తెరలేపిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో అప్రజాస్వామిక పాలన సాగుతోందని మండిపడ్డారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ దొంగదారి చర్య అని, కేంద్ర ప్రభుత్వం చట్టం రూపంలో తీసుకువచ్చిన ఎస్‌ఐఆర్ ఒక పెద్ద భూతం లాంటిదని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో.. ఎక్కడైతే మనకు ఓట్లు ఎక్కువగా ఉన్నాయో..అక్కడ ఒక పద్ధతి ప్రకారం దాదాపు 30 నుంచి 35 శాతం ఓట్లను ఫేక్ ఓట్లుగా చిత్రీకరించి, వాటిని జాబితా నుంచి తొలగించేందుకు కేంద్రం పెద్ద కుట్ర చేస్తోందన్నారు. ఓటరు వయస్సులో స్వల్ప తేడాలున్నా, పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా.. వాటన్నింటినీ వంకగా చూపి ఓట్లను లేపేసే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే బీహార్, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఈ పద్ధతిని ప్రయోగించి సక్సెస్ అయ్యారని, అదే ఫార్ములాను ఇప్పుడు తెలంగాణలోనూ ప్రయోగించాలని చూస్తున్నారన్నారు. దీన్ని కాంగ్రెస్ సైనికులు గట్టిగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నిన్న ఓట్లు.. నేడు ఏకంగా సీట్లే దొంగిలిస్తున్నారని, రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఇందుకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. మీనాక్షి నటరాజన్ కి కావాల్సిన ఓట్ల కంటే 11 ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ కేవలం ఒక పాత ఎఫ్‌ఐఆర్ కాగితాన్ని సాకుగా చూపి, ఎన్నికల అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అక్రమంగా ఆమె నామినేషన్‌ను తిరస్కరింపజేశారన్నారు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీకి దక్కాల్సిన ఒక రాజ్యసభ స్థానాన్ని వాళ్ళు దొంగిలించారన్నారు.

సింగరేణి కార్మికులకు అండగా కాంగ్రెస్..

సింగరేణి కార్మికుల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రేస్ పార్టీ అని, కార్మికులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ నాయకులు బొగ్గు బాయిల చుట్టూ తిరుగుతు కార్మికులపై కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తరువాతనే అసెంబ్లీ ఎన్నికల్లోకి పోతామన్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్రలు పన్నుతున్నారని, భారతదేశంలో ఎక్కడ బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నా ఇదే రకమైన దుర్మార్గపు పరిపాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *