సెప్టెంబర్లోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి..

  • డీఎంఎఫ్ఎ, సీఎస్ఆర్ పనుల్లో వేగం పెంచాలి
  • పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి రూరల్, (ఆంధ్రప్రభ): జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో డీఎంఎఫ్, సీఎస్ఆర్ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులతో ప్రొజెక్టర్ ద్వారా పనుల పురోగతిని పరిశీలించి,సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ కలెక్టరేట్ నుంచి డీఎంఎల్టీ, సీఎస్ఆర్ నిధులతో మంజూరైన గ్రామీణ అభివృద్ధి పనులన్నింటినీ ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పనిని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టి నిర్ణీత గడువులొ గా పూర్తి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు, ఇతర ప్రభుత్వ భవనాలు, మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడైనా క్రిటికల్ గ్యాప్స్ ఉన్నట్లయితే వెంటనే గుర్తించి సంబంధిత ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ భవనాల మరమ్మత్తు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, చిన్నారులకు సురక్షితమైన, మెరుగైన వాతావరణం కల్పించేలా చర్యలు చె పట్టాలని సూచించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఈఈ పంచాయతీరాజ్ శంకరయ్య, సంబంధిత ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.