రియల్టర్ల పై కేసులు

రియల్టర్ల పై కేసులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఆంధ్రప్రభ : బ్యాంకు ఖాతాలో మార్ట్ గేజ్(Mart gauge) అయిన ఇండస్ట్రియల్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని లేఅవుట్ల బాగోతానికి తెరలేపిన రియల్టర్ ల పై అదిలాబాద్(Adilabad) పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్ లతో పాటు సర్వే ల్యాండ్ అధికారులతో మిలాఖత్(Milakhat) అయి ఇలాంటి పత్రాలు లేని ఆరు ఎకరాల భూమిని కూడా కబ్జా చేయడం కలకం లేపుతోంది. ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు.
భూ అక్రమాల్లో రెవెన్యూ, సర్వే ల్యాండ్ అధికారుల హస్తం.. ?
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బుక్తాపూర్(Buktapur) శివారులో రణదీవే నగర్ కాలనీలో ఎం.ఎస్. ఆయిల్ మిల్స్ ఇండస్ట్రీ పేరిట 65/ బీ, 65/4 సర్వే నెంబర్లలో 2.9 ఎకరాల భూమిని ఎస్బీఐ బ్యాంకులో రుణం కింద యజమాని మనోజ్ కుమార్ అగర్వాల్ తనఖా పెట్టారు. ఆయిల్ మిల్ యజమాని మనోజ్ బ్యాంకుకు రూ. కోట్లల్లో బకాయి పడడంతో ఐదేళ్ల కిందట ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ భూమిని అటాచ్డ్ చేశారు.
అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు రమేష్ శర్మ, మామలా సెట్(Mamala Set), మహారాష్ట్రకు చెందిన పూనమ్ రాజేష్, అనుపమ తదితరులు బ్యాంకు మార్ట్ గేజ్ ఉన్న భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతో బ్యాంకు అధికారులు, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అప్పట్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయితే అప్పటి కలెక్టర్ దివ్య దేవరాజన్ ఎన్ఫోర్స్మెంట్ ఆధీనంలో ఉన్న ఈ భూమిని షెత్వరీ చేయవద్దని రెవెన్యూ, రిజిస్ట్రేషన్(Registration) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఆదేశాలు పట్టించుకోకుండా అర్బన్ రెవెన్యూ అధికారులు, సర్వే ల్యాండ్ అధికారులు రియలటర్లతో మీలాఖతై అక్రమ రిజిస్ట్రేషన్లకు తెర లేపడం చర్చి నీయంశమైంది. ఈ వ్యవహారంలో ప్రధాన రియాల్టర్లు రమేష్ శర్మ, మామ్ల సెట్ లపై ఆదిలాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆరు ఎకరాల భూమి మాయం?
ఆదిలాబాద్ పట్టణ శివారులోని సర్వేనెంబర్ 65లో ఆరు ఎకరాల భూమి కబ్జా కోరల్లో చిక్కినట్టు పోలీసులకు విచారణలో బయటపడింది. 15.24 ఎకరాల భూమికి గాను సర్వే చేస్తే రియాల్టర్ల చేతిలో 21 ఎకరాల భూమి ఉండడం తో జిల్లా కలెక్టర్ సైతం విస్తుపోయినట్టు తెలిసింది. ఆరు ఎకరాల భూమి కబ్జా(Land Possession) అయిన వ్యవహారంలో సర్వే ల్యాండ్ అధికారుల పాత్ర బయటపడింది.
రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే ల్యాండ్ అధికారులు కూడా బల్క్కొని రియల్ ఎస్టేట్(Real Estate) వ్యాపారులతో అక్రమ దందాకు తెర లేపినట్టు వెలుగు చూసింది. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ సీరియస్ గా స్పందించి కలెక్టర్కు ఫిర్యాదు చేయడం, రంగంలోకి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దిగడం రియల్ ఎస్టేట్ వ్యాపారుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తోంది.
