శ్రీరాముడిపై రాహుల్ గాంధీది భక్తి.. మోదీది ఓట్ల రాజకీయం

  • అయోధ్య రామాలయంలో జరిగిన దొంగతనంపై ప్రధాని స్పందించాలి
  • మీ నాయన చేసిన అప్పును తీర్చుతున్నాం
  • కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: శ్రీరాముడిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఉన్నది నిజమైన భక్తి అయితే, మోడీకి మాత్రం శ్రీరాముడు కేవలం ఓట్ల రాజకీయానికే పరిమితమయ్యారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. అయోధ్యలోని శ్రీరామ మందిరంలో జరిగిన దొంగతన ఘటనపై కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం మౌనం వీడాలని ఆయన డిమాండ్ చేశారు.

బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన మాట్లాడుతూ.. అయోధ్య శ్రీరామ మందిరానికి వచ్చే భక్తులు హుండీలో సమర్పించిన నగదు చోరీకి గురవడం అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన విషయమన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఉత్తరప్రదేశ్‌లో కూడా అదే పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోవడం ఆశ్చర్యకరమన్నారు.

ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వెంటనే పార్టీ ఎంపీలను అయోధ్యకు పంపించి వాస్తవాలు తెలుసుకోవాలని ఆదేశించారని తెలిపారు. శ్రీరాముడి పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ, అదే శ్రీరాముడి ఆలయంలో దొంగతనం జరిగినప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ కనీసం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

దేశాన్ని ఏకం చేసిన మహాత్ముడు

మహాత్మా గాంధీ ‘రఘుపతి రాఘవ రాజారాం’ను స్మరిస్తూ దేశాన్ని ఏకం చేశారని, జవహర్‌లాల్ నెహ్రూ కూడా శ్రీరాముడి ఆదర్శాలకు అనుగుణంగా పాలన సాగించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలు, కులాలను సమానంగా గౌరవిస్తుందని, బీజేపీ మాత్రం మతాలను, కులాలను రాజకీయ ప్రయోజనాల కోసం విభజిస్తోందని విమర్శించారు.

అయోధ్య ఘటనను కొందరు బీజేపీ నేతలు చిన్న విషయంగా అభివర్ణించడం బాధ్యతారాహిత్యమని జగ్గారెడ్డి మండిపడ్డారు. ఇదే ఘటన కాంగ్రెస్ పాలనలో జరిగి ఉంటే దేశవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు నిర్వహించేదని అన్నారు. శ్రీరాముడి ఆలయంలో జరిగిన దొంగతనాన్ని చిన్న విషయంగా చూడటం ప్రజల విశ్వాసాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు.

ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నాం

కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో బిజీగా ఉన్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన ఆర్థిక భారం, అప్పులను చెల్లిస్తూనే ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఉచిత విద్యుత్ వంటి హామీల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ప్రతిపక్షంగా కేటీఆర్ విమర్శలు చేయడం సహజమేనని, అయితే ప్రతి వ్యాఖ్యకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్యనే ఉందని, బీజేపీకి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బీజేపీ నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే వెళ్తారని, నిజమైన భక్తి ఉంటే నిత్యం ఆలయాన్ని సందర్శించే నాయకుల పేర్లు చెప్పాలని సవాల్ చేశారు.