నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
- ఉదయం 10:31 గంటలకు విడుదల చేయనున్నామంత్రి నారా లోకేష్
- ఒకేసారి ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల
- 10.57 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంపై ఉత్కంఠ
- వెబ్‌సైట్, వాట్సప్ ద్వారా సులభంగా ఫలితాలు
విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉదయం 10:31 గంటలకు ఎక్స్ వేదికగా ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈసారి ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేయనుండటం విశేషం. మొత్తం 10,57,899 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో ప్రథమ సంవత్సరం నుంచి 5,31,275 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 5,26,264 మంది విద్యార్థులు ఉన్నారు. ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా (results-bie.ap.gov.in) సులభంగా తెలుసుకోవచ్చు.
అదే విధంగా వాట్సప్ సేవ ద్వారా కూడా ఫలితాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందుకోసం 9552300009 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపితే ఫలితాలు పొందవచ్చు. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఆరో సబ్జెక్టు మార్కులను ప్రత్యేకంగా వెల్లడించనున్నారు. ఇది విద్యార్థుల అకాడమిక్ అంచనాల్లో మరింత స్పష్టతనిస్తుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా (ప్రస్తుత కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు) నుంచి సుమారు 1,02,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయడం గమనార్హం. ఫలితాల విడుదలతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠత నెలకొంది. ఉన్నత విద్యలో తదుపరి అడుగుల కోసం ఈ ఫలితాలు కీలకంగా మారనున్నాయి.
