వానమ్మ‌.. వాన చినుక‌మ్మా.. ఒక్క‌సారి!

వ‌ర్షం జాడ లేక పత్తి రైతుల ఆందోళన

స్ప్రింక్లర్లు, పైప్‌లైన్లతో పంటలను కాపాడుకునే ప్రయత్నం

ఊట్కూర్ (ఆంధ్రప్రభ): వానాకాలం ప్రారంభమై చాలారోజులు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది పెద్దఎత్తున పత్తి సాగు చేసిన రైతులు వర్షాభావం కారణంగా పంటలు ఎండుముఖం పట్టడంతో వ్యవసాయ బోరుబావుల ద్వారా స్ప్రింక్లర్లు, పైప్‌లైన్ల సహాయంతో నీటిని అందిస్తూ పంటలను కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు. నిడుగుర్తి, లక్ష్మీపల్లి, ఊట్కూర్, తిప్పరాస్‌పల్లి తదితర గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వర్షాల కోసం రైతులు, గ్రామస్తులు దేవాలయాల్లో సప్తాహ భజనలు, జలాభిషేకాలు వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నప్పటికీ వరుణుడు కరుణించకపోవడంతో నిరాశ వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలుచోట్ల పత్తి మొక్కలు వాడిపోతుండటంతో సాగు ఖర్చులు కూడా తిరిగి వస్తాయో లేదోనని రైతులు ఆవేదన చెందుతున్నారు.

మండలంలో ఈ వానాకాలంలో సుమారు 42 వేల ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు మండల వ్యవసాయ అధికారి గణేష్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు నీటిని పొదుపుగా వినియోగించాలని, అధిక నీటి అవసరమయ్యే వరి సాగును తగ్గించి ఆరుతడి పంటలు, పప్పు దినుసుల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. పెసర, మినుములు, జొన్న, రాగి వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించడం ద్వారా వర్షాభావ పరిస్థితులను కొంతవరకు అధిగమించవచ్చన్నారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ శాస్త్రీయ పద్ధతుల్లో పంటల నిర్వహణ చేపట్టాలని వ్యవసాయ శాఖ సూచించింది. మరోవైపు రైతులు వర్షాలు కురవాలని వరుణ దేవుడిని ప్రార్థిస్తూ ఆశగా ఎదురుచూస్తున్నారు.