AP | ఓటరు జాబితా సవరణలో పారదర్శకతకు పెద్దపీట..

పెండింగ్ మ్యాపింగ్‌ను గడువులోగా పూర్తి చేయాలి
ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణను నిబంధనల మేరకు పూర్తి చేయాలని ఆదేశం
విదేశీ పౌరుల ఓటు నమోదుపై క్షుణ్ణంగా విచారణకు సూచన
తిరుపతి జిల్లాలో 17 లక్షల మంది ఓటర్లలో 14.78 లక్షల వివరాల డిజిటలైజేషన్ పూర్తి
రాజకీయ పార్టీలతో సమన్వయం, పారదర్శక విధానాలకు ప్రాధాన్యం
ఈసీఐ కార్యదర్శి ఎస్.హెచ్. సంజీవ్ కుమార్ ప్రసాద్
డూప్లికేట్ ఓటర్ల నమోదును అరికట్టేందుకు కొత్త ఎస్‌ఓపీ రూపొందిస్తామని వెల్లడి


తిరుపతి, జులై 15 (ఆంధ్ర‌ప్ర‌భ ): ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకంగా, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నిర్వహించి ఓటర్ల జాబితాను మరింత ఖచ్చితత్వంతో రూపొందించాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కార్యదర్శి ఎస్.హెచ్. సంజీవ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఎన్నికల నమోదు అధికారులు (ఈఆర్‌వోలు), సహాయ ఎన్నికల నమోదు అధికారులు (ఏఈఆర్‌వోలు)తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.

జిల్లా పురోగతిని వివరించిన కలెక్టర్..
సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ కార్యక్రమం పురోగతిని ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తిరుపతి జిల్లాలో 7 అసెంబ్లీ, 3 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 2,099 పోలింగ్ కేంద్రాలు, 17,00,096 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. 2027 గృహ సర్వే ప్రకారం జిల్లా జనాభా 20.63 లక్షలుగా నమోదైందని, లింగ నిష్పత్తి 1051గా, ఈపీ రేషియో 697గా ఉందన్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా 166 కొత్త పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించగా, 44 కేంద్రాలను విలీనం చేసినట్లు వివరించారు.

డిజిటలైజేషన్‌లో గణనీయ పురోగతి..
కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించిన గడువు మేరకు జూలై 24 వరకు ఇంటింటి ఓటర్ల ధృవీకరణ కార్యక్రమం కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. రాజకీయ పార్టీలతో జిల్లా, నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించి వారి సూచనలు స్వీకరించామని, బీఎల్ఓలకు అవసరమైన శిక్షణ పూర్తి చేశామని చెప్పారు. ప్రారంభంలో ప్రీ-ఎస్‌ఎస్‌ఆర్ మ్యాపింగ్‌లో జిల్లా 66.6 శాతంతో ఉన్నప్పటికీ ప్రస్తుతం దానిని 84 శాతానికి పెంచినట్లు తెలిపారు. మొత్తం 17 లక్షల ఓటర్లలో 14.78 లక్షల మంది వివరాల డిజిటలైజేషన్ పూర్తయిందని, మిగిలిన మ్యాపింగ్‌ను కూడా గడువులోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

ఏఎస్‌డీ జాబితాపై ప్రత్యేక పరిశీలన..
జిల్లాలో 2,91,405 మంది ఏఎస్‌డీ (Absent, Shifted, Dead) జాబితాలో ఉన్నట్లు గుర్తించామని కలెక్టర్ తెలిపారు. తిరుపతి, చంద్రగిరి పట్టణ ప్రాంతాల్లో వలసలు, విద్యార్థుల తాత్కాలిక నివాసాలు, ఉద్యోగాల కారణంగా ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల ఈ సంఖ్య అధికంగా ఉందని వివరించారు. మరణించిన వారి వివరాలను సంబంధిత అధికారిక రికార్డుల ఆధారంగా ధృవీకరించి నమోదు చేస్తున్నట్లు చెప్పారు.

పెండింగ్ మ్యాపింగ్ త్వరగా పూర్తి చేయాలి..
ఈసీఐ కార్యదర్శి ఎస్.హెచ్. సంజీవ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఓటర్ల మ్యాపింగ్‌ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి నమోదును పూర్తి ఆధారాలతో పరిశీలించాలని, రాజకీయ పార్టీలకు అవసరమైన సమాచారం అందిస్తూ పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ఫిర్యాదులకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

విదేశీ పౌరుల నమోదుపై కఠిన పరిశీలన..
చంద్రగిరి నియోజకవర్గంలో నేపాల్‌కు చెందిన 16 మంది వ్యక్తులను గుర్తించిన విషయాన్ని అధికారులు సమావేశంలో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ఈసీఐ కార్యదర్శి వారి పౌరసత్వాన్ని పూర్తిగా పరిశీలించాలని, భారత పౌరసత్వం లేని వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండకూడదని స్పష్టం చేశారు. అవసరమైతే చట్టపరమైన నిబంధనల ప్రకారం వారి పేర్లను తొలగించే చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించి స్పష్టమైన ప్రామాణిక విధానాలు (ఎస్‌ఓపీ) రూపొందించి డూప్లికేట్ ఓటర్ల నమోదును నివారించే చర్యలు చేపడతామని తెలిపారు.

ఎన్నికల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం..
ఎన్నికల నిర్వహణపై జరిగిన చర్చలో చంద్రగిరి ఎన్నికల నమోదు అధికారి శ్యాంప్రసాద్ రెడ్డి ఏడాది పొడవునా ఓటర్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి నెల ఒక నిర్దిష్ట రోజున పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్ఓలను అందుబాటులో ఉంచడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు. ఉద్యోగ, ఉపాధి కారణంగా ఇతర ప్రాంతాల్లో నివసించే ఓటర్లకు సాంకేతికత ఆధారంగా సులభమైన ఓటరు బదిలీ విధానాన్ని పరిశీలించాలని సూచించారు. దీనిపై స్పందించిన ఈసీఐ కార్యదర్శి ఇవి విధానపరమైన అంశాలని, భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఎన్నికల ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్షేత్రస్థాయి అధికారుల అనుభవం ఎన్నికల వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
సమావేశంలో తిరుపతి మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ శారదాదేవి, జిల్లా రెవెన్యూ అధికారి జి. నర్సింహులు, ఎన్నికల నమోదు అధికారులు రామ్మోహన్, భానుప్రకాశ్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భరత్ నాయక్, రోజ్ మండ్, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభన్ బాబు, తిరుపతి అర్బన్, రూరల్ తహసీల్దారులు సురేష్ బాబు, జనార్ధన్, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.