డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన

ఊట్కూర్ అభివృద్ధికి కృషి చేస్తాం: సర్పంచ్ రేణుక భరత్

ఊట్కూర్ (ఆంధ్రప్రభ): ఊట్కూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని గ్రామ సర్పంచ్ ఎం. రేణుక భరత్, ఉపసర్పంచ్ రమేష్ తెలిపారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని 10వ వార్డు పాతపేటలో 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు వారు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా కల్పిస్తున్నామని చెప్పారు. డ్రైనేజీ నిర్మాణంతో వర్షపు నీరు నిల్వ ఉండకుండా ప్రజలకు ఇబ్బందులు తొలగుతాయని పేర్కొన్నారు. గ్రామ ప్రజల సహకారంతో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.