నందిగామలో గాలివాన బీభత్సం

నందిగామలో గాలివాన బీభత్సం

ఎగిరొచ్చిన షెడ్‌తో రెండు ఇళ్లు ధ్వంసం

అర్ధరాత్రి ప్రాణాలతో బయటపడ్డ కుటుంబాలు.. బాధితులకు అండగా అధికారులు, నాయకులు

నందిగామ, ఆంధ్రప్రభ : నందిగామ పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. మూడో వార్డులో రేకులతో నిర్మించుకున్న రెండు ఇళ్లు పూర్తిగా ధ్వంసమవడంతో రెండు కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో బాధితులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.

స్థానికంగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌పై ఏర్పాటు చేసిన పెంట్‌హౌస్ షెడ్ గాలివాన ధాటికి ఇనుప గొట్టాలతో సహా ఎగిరిపడి, పక్కనే ఉన్న జెట్టి వెంకటేశ్వరరావు, ఆరే శ్రీనివాసరావు కుటుంబాలకు చెందిన ఇళ్లపై కూలిపోయింది. దీంతో ఇళ్ల రేకులు చెల్లాచెదురై, ఇంట్లోని ఫ్రిజ్, వంట సామగ్రి, బట్టలు, ఇతర గృహోపకరణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

అర్ధరాత్రి సమయంలో పెద్ద శబ్దంతో ఇనుప రాడ్లు, రేకులు ఇళ్లపై పడటంతో నిద్రలో ఉన్న కుటుంబ సభ్యులు భయాందోళనల మధ్య బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా, జీవితాంతం కూడబెట్టుకున్న సామాన్లు క్షణాల్లో నేలమట్టం కావడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

“మేము పేదవాళ్లం.. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. ఉన్న ఒక్క ఇల్లు కూడా పోయింది. ప్రభుత్వం, దాతలు మమ్మల్ని ఆదుకోవాలి” అంటూ బాధితులు జెట్టి వెంకటేశ్వరరావు, ఆరే శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు రోడ్డుపైనే ఉంటామని తెలిపారు.

అపార్ట్‌మెంట్‌పై సరైన భద్రతా చర్యలు లేకుండా షెడ్ ఏర్పాటు చేయడమే ప్రమాదానికి కారణమని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై షెడ్ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.

ఘటన విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ లోవరాజు, మూడో వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి ఇమామ్ జానీ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Leave a Reply