కనకదుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. సామాన్యులకే ప్రాధాన్యం
కనకదుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. సామాన్యులకే ప్రాధాన్యం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ:
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేసవి సెలవుల ప్రభావంతో ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం 7 గంటల నుంచే రద్దీ పెరగడంతో ఆలయ యంత్రాంగం అప్రమత్తమై ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. డీఈఓ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో, అసిస్టెంట్ కమిషనర్ రంగారావు పర్యవేక్షణలో ఆలయ ఏఈవోలు చంద్రశేఖర్, వెంకటరెడ్డి, రమేష్‌లు క్యూలైన్ల నిర్వహణను స్వయంగా పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, ప్రసాదాలు, అన్నదానం, వైద్య సహాయం వంటి అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచారు.
వీఐపీ దర్శనాలకు బ్రేక్..
భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే వీఐపీ , ప్రోటోకాల్ దర్శనాలను కూడా నిలుపుదల చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేయడం విశేషం. దీంతో సామాన్య భక్తులకు వేగవంతంగా అమ్మవారి దర్శనం లభించి సంతృప్తి వ్యక్తం చేశారు.
క్యూ లైన్లలోనే చల్లని నీటి పంపిణీ…
వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రవేశపెట్టిన మొబైల్ వాటర్ క్యాన్ల విధానం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తుల వద్దకే సిబ్బంది చేరుకుని చల్లని తాగునీటిని అందించారు. ఎండలో గంటల తరబడి వేచి ఉన్న తమకు ఈ సౌకర్యం ఎంతో ఉపశమనాన్ని కలిగించిందని భక్తులు హర్షం వ్యక్తం చేశారు. దీనితో పాటు ఉచిత ప్రసాదం, నిత్య అన్నదాన కార్యక్రమాలను కూడా నిరంతరాయంగా నిర్వహించారు. భక్తులకు అవసరమైన ప్రతి సేవను అందించేందుకు ఆలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేశారు.
భక్తుల మధ్యకు వెళ్లిన అధికారులు.
ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు స్వయంగా క్యూ లైన్లలో పర్యటించి భక్తుల సమస్యలను తెలుసుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఇన్‌చార్జ్ ఈఓతో పాటు సిబ్బంది క్యూలైన్లను క్రమబద్ధీకరిస్తూ రద్దీని సమర్థంగా నియంత్రించారు. పాలకమండలి, అధికారుల సమన్వయం, ముందస్తు ప్రణాళిక, నిరంతర పర్యవేక్షణ ఫలితంగా భారీ రద్దీ ఉన్నప్పటికీ ఎక్కడా తొక్కిసలాటలు, అవ్యవస్థలకు తావులేకుండా దర్శనాలు ప్రశాంతంగా సాగాయి. ఆలయ యంత్రాంగం కల్పించిన సౌకర్యాలు, భక్తుల పట్ల చూపిన శ్రద్ధపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులను అభినందించారు.


