Drug De Addiction Centres | డీఅడిక్షన్ కేంద్రాలతో ప్రభుత్వ కీలక చర్యలు

Drug De Addiction Centres | డీఅడిక్షన్ కేంద్రాలతో ప్రభుత్వ కీలక చర్యలు

Drug De Addiction Centres | రూ.9.86 కోట్లతో డీఅడిక్షన్ కేంద్రాల అభివృద్ధి
మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వ కఠిన చర్యలు
వ్యసన బాధితులకు ఆధునిక చికిత్స, కౌన్సెలింగ్ సదుపాయాలు
యుద్ధ ప్రాతిపదికన పోస్టుల భర్తీతో సేవల విస్తరణ

Drug De Addiction Centres | అమరావతి, ఆంధ్రప్రభ: మాదకద్రవ్యాలు.. బంగారు భవితను బుగ్గిపాలు చేసే, భయానక విషపదార్థాలు. వీటిబారినపడి తమ జీవితాలను అర్థాంతరంగా కోల్పోతున్న యువత ఎందరో. అంధకారంలోకి జారుకుంటున్న యువతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వ్యసన విముక్తి కేంద్రాల ద్వారా వారికి ఉపశమనం కల్పిస్తోంది. సాధారణ స్థితికి తీసుకువచ్చే ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. జూన్ 26 మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం మాదకద్రవ్యాల కట్టడికి ఇప్పటిదాకా చేసిన, చేయనున్న కార్యాచరణపై ఓ ప్రకటన విడుదల చేసింది.

రూ.9.86 కోట్లతో డీఅడిక్షన్ కేంద్రాలు

రాష్ట్రంలో రూ.9.86 కోట్లతో 16 డీఅడిక్షన్ కేంద్రాలను అభివృద్ధి చేయబోతున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ కేంద్రాల్లో బయో-ఫీడ్ బ్యాక్ మెషిన్, ఈసీజీ మెషిన్ వంటి ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. ప్రస్తుతం ఉన్న కేంద్రాల్లో మూడింటిని పూర్తిస్థాయిలో, అన్ని సౌకర్యాలతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ చేపట్టనున్నారు.

కర్నూలు, తిరుపతి, గుంటూరు, శ్రీకాకుళం, నంద్యాల, తూర్పు గోదావరి, ప్రకాశం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, పల్నాడు, చిత్తూరు, శ్రీ సత్యసాయి, బాపట్ల, విశాఖ, ఎన్టీఆర్, కడపలోని వ్యసన విముక్తి కేంద్రాలను అన్ని రకాల చికిత్స, కౌన్సెలింగ్ అందించేందుకు వీలుగా అభివృద్ధి చేయనున్నారు.

ఇందులో రూ.8 కోట్ల నిర్మాణాలు, ఫర్నిచర్, ఇతర అవసరాలకు వినియోగిస్తారు. మిగిలిన నిధులతో బయో-ఫీడ్ బ్యాక్ మెషిన్, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. బయో-ఫీడ్ బ్యాక్ మెషిన్ ఖరీదు రూ.2.50 లక్షలు. దీనిని వ్యసనపరుల్లో ఉండే మానసిక ఒత్తిడి, కుంగుబాటు తగ్గించేందుకు వినియోగిస్తారు.

మాదకద్రవ్యాల మూలాలను ఏరేస్తాం

రాష్ట్రంలో మాదకద్రవ్యాల మూలాలను ఏరివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదు. విశాఖపట్నం, విజయవాడ, కడపలోని కేంద్రాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీగా గుర్తించే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ కేంద్రాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీగా గుర్తిస్తే అక్కడ మరిన్ని సదుపాయాలు సమకూరతాయి. ఇతర కేంద్రాల నుంచి ఉన్నత చికిత్స నిమిత్తం బాధితులకు ఉపశమనం లభిస్తుంది.

– సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్య మంత్రి

యుద్ధ ప్రాతిపదికన పోస్టుల భర్తీ

రాష్ట్రవ్యాప్తంగా 25 వ్యసన విముక్తి కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో 346 పోస్టుల భర్తీకి 200కు పైగా ఖాళీలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 57 పోస్టులను భర్తీ చేసింది. వీరిలో వైద్యులు, కౌన్సెలర్లు, నర్సులు, వార్డు బాయ్స్, యోగా థెరపిస్టులు, ఇతర పోస్టులు ఉన్నాయి.

మరో 123 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ జరిగి, భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. ఇవి కాకుండా మరో 52 పోస్టుల భర్తీకి అడుగులు పడుతున్నాయి. ఒక్కో కేంద్రంలో వైద్యాధికారి పోస్టుతో కలిపి 14 ఉద్యోగాలను ప్రభుత్వం మంజూరు చేసింది.