జీజీహెచ్ లో దారుణ ఘటన..

జీజీహెచ్ లో దారుణ ఘటన..
- విజయవాడలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం?
- మానవ అవయవాన్ని లాక్కెళ్లిన కుక్కలు
- బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ దారుణం
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: విజయవాడలోని న్యూ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. శస్త్రచికిత్స అనంతరం తొలగించిన మానవ శరీర భాగాలను సరైన విధంగా బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్రకారం భద్రపరచకుండా నిర్లక్ష్యంగా పడవేయడంతో, వాటిని కుక్కలు లాక్కెళ్లి పీక్కుతిన్నా సంఘటన ఆందోళనకరంగా మారింది.
ఈ ఘటన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రోగులు, వారి బంధువుల్లో భయాందోళనలు కలిగించింది. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం శస్త్రచికిత్సలలో తొలగించిన మానవ కణజాలం, అవయవాలు వంటి వ్యర్థాలను ప్రత్యేక పద్ధతుల్లో సేకరించి, గుర్తింపు పొందిన వ్యవస్థ ద్వారా శాస్త్రీయంగా నిర్వీర్యం చేయాలి. నిర్లక్ష్యంగా బహిరంగ ప్రదేశాల్లో వదిలివేయడం ప్రజారోగ్యానికి ప్రమాదకరం. భారతదేశంలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలు అమల్లో ఉన్నా క్షేత్ర స్థాయిలో అమలు లేకపోవడం ఇటువంటి సంఘటనలు కనిపిస్తున్నారు.
