APL | ఫైనల్ కు చేరిన బుల్స్
- మరోసారి ఆల్రౌండ్ పర్ఫామెన్స్ తో సత్తా చాటిన భీమవరం
- క్వాలిఫైయర్-1లో అమరావతి జట్టు ఓటమి
- ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా హేమంత్ రెడ్డి
ఆంధ్రప్రభ, విజయవాడ : ఐపీఎల్-2026 సీజన్-5లో భాగంగా మంగళగిరి వేదికగా జరిగిన తొలి క్వాలిఫైయర్‌లో భీమవరం బుల్స్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు అర్హత సాధించింది. క్యాపిటల్ అమరావతి రాయల్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భీమవరం జట్టు మరోసారి ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది.
టాస్ గెలిచిన భీమవరం బుల్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్ అమరావతి రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్‌లో కరణ్ షిండే 42 బంతుల్లో 58 పరుగులు (5 ఫోర్లు, 2 సిక్సర్లు), యువీవీ వర్మ 15 బంతుల్లో 34 పరుగులు (1 ఫోర్, 4 సిక్సర్లు) చేసి రాణించగా, మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు.
భీమవరం బౌలర్లలో రవితేజ మూడు వికెట్లు తీయగా, పీవీఎస్‌ఎన్ రాజు, రవికిరణ్ తలో రెండు వికెట్లు పడగొట్టి అమరావతి బ్యాటింగ్‌ను కట్టడి చేశారు.
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భీమవరం బుల్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు హేమంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు. హేమంత్ రెడ్డి 28 బంతుల్లో 57 పరుగులు (4 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి విజృంభించగా, రేవంత్ రెడ్డి 14 బంతుల్లో 35 పరుగులు (4 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించాడు. అనంతరం సాయి శ్రవణ్ 17 బంతుల్లో 39 పరుగులు (3 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
దీంతో భీమవరం బుల్స్ కేవలం 12.1 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. అమరావతి బౌలర్లలో టోషిత్ యాదవ్, జి. యశ్వంత్ తలో వికెట్ తీశారు.
అద్భుత అర్ధశతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన హేమంత్ రెడ్డికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
ఇక బుధవారం జరిగే క్వాలిఫైయర్-2లో సింహాద్రి వైజాగ్ లయన్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్లో భీమవరం బుల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
