పేద పిల్లలకు పౌష్టికాహారం అందించడమే ఐసిడిఎస్ లక్ష్యం

పేద పిల్లలకు పౌష్టికాహారం అందించడమే ఐసిడిఎస్ లక్ష్యం
లక్ష్యాన్ని నీరుగార్చిన వారిపై కఠిన చర్యలు తప్పవు
ఐసిడిఎస్ జెడి శివజ్యోతి
అధికారులు, ఉద్యోగుల పనితీరుపై ఓపెన్ ఫోరం నిర్వహణ
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన శ్రీ సత్యసాయి జిల్లాలో పేద పిల్లలకు సమగ్ర పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బాటలు వేయడమే సమగ్ర శిశు అభివృద్ధి సేవల శాఖ (ఐసిడిఎస్) ప్రధాన లక్ష్యమని ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ శివజ్యోతి స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను విస్మరించి నిర్లక్ష్యం, అవినీతి, అక్రమాలకు పాల్పడే అధికారులు, ఉద్యోగులపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని హెచ్చరించారు. గురువారం శ్రీ సత్యసాయి జిల్లా ఐసిడిఎస్ పీడీ కార్యాలయంలో శాఖకు చెందిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో ప్రత్యేక ఓపెన్ ఫోరం నిర్వహించారు.
ఈ సందర్భంగా శాఖలో పనిచేస్తున్న సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, సేవల అమలులో ఎదురవుతున్న అవరోధాలు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై జెడి శివజ్యోతి విస్తృతంగా చర్చించారు. ఉద్యోగులు ఒక్కొక్కరితో వేర్వేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకోవడంతో పాటు శాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, ప్రజల నుంచి అలాగే ఉద్యోగుల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో గత రెండు రోజులుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో శాఖ పరమైన విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా గురువారం శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి విచారణ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా కొనసాగుతోందని, ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా బాధితులు, ప్రజలు, ఉద్యోగుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. ఐసిడిఎస్ ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందాల్సిన పౌష్టికాహారం సరైన విధంగా చేరుతుందా లేదా అన్న అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాల పనితీరు, ఆహార సరఫరా, హాజరు నమోదులు, పిల్లల ఆరోగ్య స్థితి వంటి అంశాలపై సమగ్రంగా పరిశీలన కొనసాగుతోందన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎక్కడైనా లోపాలు, నిర్లక్ష్యం బయటపడితే సంబంధిత వారిపై కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. తమ విచారణలో భాగంగా అందిన ప్రతి ఫిర్యాదును యథాతథంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, వాటిపై అవసరమైన చర్యలు తీసుకునేలా సిఫార్సులు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఆశించిన లక్ష్య సాధనలో అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పిల్లల భవిష్యత్తుతో ముడిపడిన శాఖ కావడంతో ప్రతి ఉద్యోగి సేవా దృక్పథంతో పనిచేయాలని ఆమె కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పోషకాహార కార్యక్రమాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగుతుందని చెప్పారు. పేద పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించడం ద్వారా వారి ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా భవిష్యత్తులో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు ఉంటాయా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, “ఎలాంటి ఉపేక్ష ఉండదు. అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్యం ఎవరైనా చేసినా చర్యలు తప్పవు” అని జెడి శివజ్యోతి స్పష్టం చేశారు. ఈ ఓపెన్ ఫోరం ద్వారా శాఖలోని సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం లభించిందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
