Women’s T20 WC 2026 | భారత్‌కు షాక్.. సెమీస్ ఆశలు ఆవిరి !!

  • ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం..
  • పోరాడి ఓడిన భారత మహిళల జట్టు

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు సెమీఫైనల్ ఆశలు ఆవిర‌య్యాయి. ఆస్ట్రేలియాతో జ‌రిగిన చివ‌రి లీగ్ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు ఓట‌మిపాలైంది. దీంతో సెమీస్ ఆశ‌లు ఛిద్రమయ్యాయి. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్.. ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

గ్రూప్-1లో ఆస్ట్రేలియా ఈ విజయంతో 10 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అదే గ్రూప్‌లోని దక్షిణాఫ్రికా 8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. భారత్ 6 పాయింట్లతో మూడో స్థానానికే పరిమితమవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

కాగా, టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన (38), షెఫాలీ వర్మ (34) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 66 పరుగులు జోడించిన ఈ జోడీ భారత్‌కు బలమైన పునాది వేసింది. అనంతరం జెమీమా రోడ్రిగ్స్ 34 పరుగులు చేసి చివరి ఓవర్‌కు ముందు రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగింది.

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాత్రం ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. కేవలం 27 బంతుల్లో 56 పరుగులు చేసి చివరి ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాదింది. రిచా ఘోష్ (1 నాటౌట్), దీప్తి శర్మ (4 నాటౌట్) సహకారంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 170 పరుగులు చేసింది.

171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు రెండో బంతికే రెనుకా సింగ్ ఠాకూర్ షాక్ ఇచ్చి జార్జియా వోల్ (4)ను ఔట్ చేసింది. అయితే బెత్ మూనీ (22), ఫోబీ లిచ్‌ఫీల్డ్ (24) ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. అనంతరం భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 10 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 72/3తో కష్టాల్లో పడింది.

అయితే ఎలీస్ పెర్రీ, అష్లే గార్డ్నర్ కలిసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. నాలుగో వికెట్‌కు 100 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత సెమీస్ ఆశలపై నీళ్లుచ‌ల్లారు. పెర్రీ 38 బంతుల్లో 56 పరుగులు చేసి చివర్లో ఔటైనా… అప్పటికే మ్యాచ్‌ను ఆస్ట్రేలియా వైపు తిప్పింది. గార్డ్నర్ 29 బంతుల్లో 53 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది.

చివర్లో జార్జియా వేర్‌హామ్ విజయం ఖరారు చేసే బౌండరీ కొట్టడంతో ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

భారత్ తరఫున శ్రీ చరణి రెండు వికెట్లు పడగొట్టగా, రెనుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ తలో వికెట్ తీశారు. అయితే కీలక సమయంలో పెర్రీ-గార్డ్నర్ జోడీని విడదీయలేకపోవడంతో భారత్‌కు నిరాశ తప్పలేదు.