ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు కౌంట్‌డౌన్..
- 17 ఏళ్ల తర్వాత భారత్‌లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్..
- సింధు ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : స్వదేశంలో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ నిర్వహించడం భారత బ్యాడ్మింటన్‌కు చారిత్రాత్మక ఘట్టమని, సొంత అభిమానుల మధ్య ప్రపంచ టైటిల్ కోసం పోటీపడే అవకాశం దక్కడం ఎంతో ప్రత్యేకమని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అన్నారు.
ఆగస్టు 17 నుంచి 23 వరకు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరగనున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు సంబంధించి భారత బ్యాడ్మింటన్ సంఘం (బీఏఐ) ఆదివారం 50 రోజుల కౌంట్‌డౌన్‌ను అధికారికంగా ప్రారంభించింది.
ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ప్రపంచ ఛాంపియన్‌షిప్ తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన టోర్నమెంట్‌లలో ఒకటని చెప్పారు. తన కెరీర్‌లోని ఎన్నో మధుర జ్ఞాపకాలు, కఠినమైన పాఠాలు, గర్వించదగ్గ విజయాలు ఈ టోర్నమెంట్ ద్వారానే లభించాయని సింధు పేర్కొన్నారు. స్వదేశంలో, భారత అభిమానుల సమక్షంలో ప్రపంచ టైటిల్ కోసం పోటీపడే అవకాశం రావడం తనకు మరింత ఆనందాన్ని ఇస్తోందని తెలిపారు.
2019లో స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సింధు.. ఇప్పటివరకు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన ఏకైక భారత షట్లర్‌గా కొనసాగుతున్నారు. 17 ఏళ్ల తర్వాత భారత్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ నిర్వహించడం భారత బ్యాడ్మింటన్ అభివృద్ధికి నిదర్శనమని సింధు అన్నారు. ఈ టోర్నమెంట్ యువ క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చి ప్రపంచ స్థాయిలో రాణించాలనే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. ప్రపంచ ఛాంపియన్‌షిప్ తిరిగి భారత్‌కు రావడం భారత బ్యాడ్మింటన్ చరిత్రలో కీలక ఘట్టమని అన్నారు. అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల నిర్వహణలో భారత్‌పై ప్రపంచ క్రీడా సమాజం ఉంచుతున్న విశ్వాసానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ మెగా టోర్నీలో 55కిపైగా దేశాల నుంచి దాదాపు 800 మంది క్రీడాకారులు, కోచ్‌లు, సాంకేతిక అధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొననున్నారు. దక్షిణ కొరియా ఒలింపిక్ ఛాంపియన్ ఆన్ సె-యంగ్, చైనా స్టార్ షట్లర్ షి యూ కీ, థాయ్‌లాండ్‌కు చెందిన కున్లావుట్ విటిడ్సార్న్‌తో పాటు ప్రపంచ అగ్రశ్రేణి డబుల్స్ జోడీలు కూడా ఈ పోటీల్లో బరిలోకి దిగనున్నాయి.
