రైతుల కష్టాలు చూడలేకే క్షేత్రస్థాయికి వచ్చాను

రైతుల కష్టాలు చూడలేకే క్షేత్రస్థాయికి వచ్చాను
- ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ: కమ్మర్ పల్లి మండలం చౌట్ పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వయంగా గురువారం పరిశీలించారు. నెల రోజులుగా రైతులు ధాన్యపు కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నా, కొనుగోలు ప్రక్రియ మందకొడిగా సాగడంపై ఆయన జిల్లా డీఎస్వో తో ఫోన్‌లో మాట్లాడారు. చౌట్ పల్లిలో ధాన్యం కోసి నెల రోజులు గడుస్తున్నా, ఇప్పటివరకు కేవలం మూడు లారీలు మాత్రమే పంపడంపై అధికారులను నిలదీశారు.
75 మంది రైతులు వెయిటింగ్ లిస్టులో ఉండగా, కేవలం 25 మందికి మాత్రమే టోకెన్లు రావడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర సెంటర్లు క్లోజ్ అవుతున్న నేపథ్యంలో, అక్కడి వాహనాలను తక్షణమే చౌట్ పల్లి మరియు బషీరాబాద్ వంటి పెద్ద గ్రామాలకు మళ్లించాలని ఆదేశించారు. రవాణాలో జాప్యం జరిగితే రైతులు అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
క్వింటాల్‌కు 44 నుండి 45 కిలోల వరకు తరుగు (తరుగుదల) తీసుకుంటున్నారన్న రైతుల ఫిర్యాదుపై ఎమ్మెల్యే స్పందించారు. కలెక్టర్ గారు చెప్పిన విధంగా 41.5 కిలోల కంటే ఒక్క గ్రాము కూడా అదనంగా తీసుకోకూడదని, తరుగు పేరుతో రైతులను వేధించే మిల్లులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి రైతుల బాధలు చూడాలని సూచించారు. చౌట్ పల్లి ఒక పెద్ద గ్రామమని, ఇక్కడ ధాన్యం నిల్వలు ఎక్కువగా ఉన్నందున యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రైతులందరికీ న్యాయం జరిగే వరకు, ధాన్యం చివరి గింజ కొనే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలియజేశారు. ఆయన వెంట సర్పంచ్ మహబూబ్,మండల నాయకులు,కార్యకర్తలు, రైతులు తదితరులు ఉన్నారు.
