ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలు
అపురూపంగా కనకదుర్గమ్మ అలంకరణ
ఏకాదశ అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం
తన్మయంతో వీక్షించిన భక్తజనం…
14 లక్షల మంది రాక..
30 లక్షలకు పైగా లడ్డు విక్రయం…
అమ్మవారికి కోట్ల రూపాయల ఆదాయం…
బంగారం, వెండి, విదేశీ డాలర్లు అమ్మకు బహుమానం…
ఫలించిన ఉన్నతాధికారుల కష్టం
లోటుపాట్లకు తావివ్వని అధికార యంత్రాంగం…
అధికారులకు సీఎం చంద్రబాబు ప్రశంసలు..
( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : శ్రీ విశ్వవసు నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు (Dussehra Sharanavaratri celebrations) విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రిపై అట్టహాసంగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దివ్య మంగళ అలంకరణ, మిరమిడ్లు గులిపే విద్యుత్ దీపాల అంకరణ, జై భవాని (Jai Bhavani) నామస్మరణ.. వర్ణమాల శోభితమైన పొలాలంకరణ.. వెరసి ఇలా వైకుంఠాన్ని తలపించేలా ఇంద్ర గిరిలు పులకరించాయి. ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెబుతూ సకలజనులకు భక్త పారవశ్యంలో వాళ్లలాడించేలా శ్రీ కనకదుర్గమ్మ వారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పరమ పవిత్రంగా 11 రోజులపాటు నిర్వహించారు.

జగదంబ వేడుకల కోసం నగరమంతా వెలుగు రవ్వలు పూయగా 11అలంకరణలో కనకదుర్గమ్మ వారు భక్తులకు అనుగ్రహించారు. మనసారా కనులారా వీక్షించిన భక్తజనం కనకదుర్గమ్మకు బంగారం వెండి విదేశీ డాలర్లు నగదుతో ముక్కులను చెల్లించుకున్నారు. పరమ పవిత్రంగా జరిగిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు దసరా పర్వదినం నాడు పూర్ణాహుతితో ఉత్సవాలు ముగియగా, సాయంత్రం సమయాన గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వారు నగరోత్సవంలో భక్తులకు కనువిందు చేసి హంస వాహనంపై ప్రత్యేక పూజలను అందుకున్నారు.

లక్షల్లో తరలి వచ్చిన భక్తులు…
ఈ ఏడాది విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలు రాష్ట్రాలు దేశాలు దాటి భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చారు. మొదటి మూడు రోజులు లక్షలోపు భక్తుల రాక అమ్మవారి ఆలయానికి ఉండగా తర్వాత రోజుల్లో లక్షకు దాటుతూ ప్రతిరోజు భక్తులు తరలి వస్తూనే ఉన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల 11 రోజుల్లో సుమారు 14 లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని వివిధ రూపాలలో దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ప్రసాదమైన లడ్డు మూడు లక్షలకు పైగా విక్రయాలు జరిగాయి. అలాగే పలు అర్జిత సేవలతో పాటు తలనీలాలు వివిధ రూపాల్లో టికెట్లు కొనుగోలుతో కనకదుర్గమ్మ వారికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఈ వేడుకల్లో అమ్మవారి దర్శనానికి భక్తులకు మూడు నుండి గరిష్టంగా ఏడు గంటల సమయం పట్టగా, ప్రతిరోజు హోల్డింగ్ ఏరియాలో భక్తులు అమ్మ దర్శనం కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.
క్రమంగా పెరిగిన భవానీల రాక…
ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల సందర్భంగా చివరి నాలుగు రోజుల్లో భవానీల రాక క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. మండల దీక్ష అర్థ మండల దీక్ష 11 రోజుల దీక్ష తీసుకుంటున్న భవానీలు కనకదుర్గమ్మను దర్శించుకుని ఇరుముడులు సమర్పించుకుని దీక్షా విరమణ చేసేందుకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి మారుమూల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఉత్తరాంధ్ర నుండి ఎక్కువ సంఖ్యలో వచ్చిన భవానీల రాకతో పాటు పశ్చిమగోదావరి తూర్పుగోదావరి తో పాటు ఉమ్మడి కృష్ణాజిల్లా నుండి పెద్ద ఎత్తున భక్తులు కాలినడకన తమ ప్రాంతం నుండి ఇంద్రకీలాద్రి కి తరలివచ్చారు. భవానీల రాక పెరుగుతుండడం జై భవాని నామస్మరణ మారుమోగుతుండడంతో క్యూ లైన్లన్నీ గరిష్టంగా భక్తులతో కిటకిటలాడుతూ వచ్చాయి. చివరి రోజుల్లో భవానీల రాక పెరిగిన సందర్భంలో అధికారులు క్యూ లైన్లు అన్నింటిని ఉచితం చేయడంతో అమ్మవారి దర్శనం సాధారణ భక్తులకు త్వరగా అయ్యేలా జరిగింది.
పూర్ణాహుతితో ముగిసిన ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై 11 రోజులు అత్యంత వైభవంగా జరిగిన దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు చివరి రోజు దసరా పర్వదినం గురువారం నాడు పూర్ణాహుతితో ఉత్సవాలు ముగిశాయి. ఇంద్రకీలాద్రిపై ఉన్న పాత యాగశాలలో అత్యంత వైభవంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో కమిషనర్ రామచంద్ర మోహన్ ఈవో శీనా నాయక్ దుర్గ గుడి చైర్మన్ బొర్రా రామకృష్ణ గాంధీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను పూర్ణాహుతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజు స్వామివారిని కొండపై నుండి ఊరేగింపుగా నగరోత్సవంలో భాగంగా కనకదుర్గ నగరకు తీసుకువచ్చి అక్కడ నుండి ఊరేగింపుగా దుర్గా ఘాటులోని హంస వాహనంపై కూర్చుండబెట్టి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ ఏడాది నీటి ప్రవాహం అత్యధికంగా ఉన్న నేపథ్యంలో అధికారులు జలవిహారాన్ని రద్దు చేయడంతో కేవలం హంస వాహనంపై అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం ఉత్సవ విగ్రహాలను వంటల్లోని పోలీస్ స్టేషన్ కు ఊరేగింపుగా తీసుకువెళ్లారు.
ఏర్పాట్లు సమర్థవంత నిర్వహణపై సీఎం ప్రశంసలు
మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యం కోసం చేసిన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ప్రత్యేకంగా ప్రశంసించారు. అంకిత భావం పూర్తి సమన్వయంతో సమర్థవంతంగా లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులకు అమ్మవారి దర్శనాన్ని అత్యంత ప్రశాంత వాతావరణంలో నిర్వహించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు అభినందనలు తెలిపారు. దసరా పర్వదినం నాడు ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లను ప్రశంసిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ట్వీట్లు అధికారులకు ప్రశంసల జల్లు కురిపించారు.
