పాడిపంటలతో రాష్ట్రం, దేశం సస్యశ్యామలం కావాలి

ఏరువాక పౌర్ణమి సందర్భంగా ధాన్యలక్ష్మి ఉత్సవం.. ఆదర్శ మహిళా రైతులకు ఘన సన్మానం

నంద్యాల ప్రతినిధి. ఆంధ్రప్రభ : భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమని, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు ప్రకృతి, భూమాతతో ముడిపడి ఉంటాయని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ చైర్మన్ దాసరి శ్రీనివాసులు అన్నారు. పాడిపంటలతో రాష్ట్రం, దేశం సస్యశ్యామలం కావాలని, అన్నదాతల శ్రేయస్సు కోసం సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు.

ఏరువాక పౌర్ణమి సందర్భంగా సోమవారం నంద్యాల జిల్లా పాండురంగాపురం గ్రామంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధాన్యలక్ష్మి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ చైర్మన్ దాసరి శ్రీనివాసులు, శ్రీ రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏరువాక పౌర్ణమి రైతాంగానికి అత్యంత ప్రాధాన్యమైన పండుగ అని, రామనామ స్మరణతో పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. రైతులు విత్తుకొనే ధాన్యంలో భక్తి, శక్తి నిండి ఉండాలని, రైతులు, మహిళలను ధాన్యలక్ష్ములుగా భావించి పసుపు, కుంకుమలతో గుప్పెడు వడ్లను ప్రసాదంగా అందజేసే కార్యక్రమాన్ని గ్రామంలోని పాండురంగ స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు.

భారతీయ సంస్కృతి, వ్యవసాయ సంప్రదాయాలు, ప్రకృతి పరిరక్షణ, ఆధ్యాత్మిక విలువలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ప్రకృతి సహకారంతో పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.

దేశంలోనే పాండురంగాపురం గ్రామం గతంలో ఆదర్శ పంచాయతీగా గుర్తింపు పొందిందని, ఈ గ్రామంలో మహిళా రైతుల సంఖ్య అధికంగా ఉండటం విశేషమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదర్శ మహిళా రైతులను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి, ప్రగతి రెడ్డి, గ్రామ పెద్దలు ఎర్రబోలు పురుషోత్తం రెడ్డి, కొండా మోహన్ రెడ్డి, కొమ్ము శివనాగిరెడ్డి, గాది బసవరెడ్డి, సురేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రైతులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.