శాస్త్రీయ సాగుతో రైతు ఆదాయం పెంపే ప్రభుత్వ లక్ష్యం

మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలు సాగు చేయాలి: మంత్రి అచ్చెన్నాయుడు

ఉమ్మడి గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : శాస్త్రీయ సాగు విధానాలు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల ప్రణాళిక, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో రైతుల ఆదాయాన్ని పెంచడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, మార్కెట్ సదుపాయాలు కల్పిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోందని తెలిపారు.

గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని మంత్రి ఎద్దులతో పొలం దున్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో 66 శాతం మంది వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడుతున్నందున ఈ రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ, నీటిపారుదల శాఖలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించిన ఆయన, విత్తన కంపెనీల బకాయిలు చెల్లించి సరఫరా వ్యవస్థను పునరుద్ధరించామని తెలిపారు. ప్రస్తుతం నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో రైతులకు అందిస్తున్నామని చెప్పారు.

ఒకే పంటపై అధికంగా ఆధారపడకుండా మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని పంటల సాగు చేయాలని రైతులకు సూచించారు. అధిక రసాయనాల వినియోగం వల్ల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలను పాటించాలని కోరారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదని స్పష్టం చేసిన మంత్రి, ప్రత్యేక యాప్ ద్వారా కేవలం 20 రోజుల్లోనే 15 లక్షలకు పైగా ఎరువుల బస్తాలను పంపిణీ చేశామని తెలిపారు. మూడు లక్షలకుపైగా కౌలు రైతులు కూడా ఈ సేవలను వినియోగించుకున్నారని చెప్పారు. మట్టి పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువుల వినియోగంతో దిగుబడులు, నాణ్యత పెరుగుతాయని పేర్కొన్నారు.

వర్జీనియా పొగాకు ధరల విషయంలో రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని, కిలో రూ.200 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవద్దని వ్యాపారులకు సూచించినట్లు తెలిపారు. ఉద్యానవన పంటలకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. తోతాపురి మామిడి రైతులకు ఈ ఏడాది కూడా కిలోకు రూ.4 చొప్పున ప్రోత్సాహకం కొనసాగుతుందని వెల్లడించారు.

అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు హామీ మేరకు ఆర్థిక సాయం అందిస్తున్నామని, వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి విమర్శలు చేశారు. అమరావతి రైతుల త్యాగాలను విస్మరించిన వైసీపీ నేతలకు రాజధాని గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, ప్రజల ఆగ్రహానికి వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, బూర్ల రామాంజనేయులు, వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.