రహదారి ప్రమాదాల నియంత్రణపై దృష్టి
రహదారి ప్రమాదాల నియంత్రణపై దృష్టి
కర్నూలు, ఆంధ్రప్రభ: జిల్లాలో రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వాహనదారులు రహదారి భద్రత నియమాలు కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలను నివారించడం సాధ్యమని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో సమావేశాలు నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బైక్‌లపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అధిక వేగం, ఓవర్‌లోడ్, మద్యం సేవించి వాహనం నడపడం వంటి చర్యలను పూర్తిగా నివారించాలని హెచ్చరించారు. సెల్‌ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని వివరించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి మే 1 వరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విస్తృతంగా ఈ-చలాన్లు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
ఓవర్ స్పీడ్ చేసిన 2,928 మంది
హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన 2,491 మంది
సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేసిన 827 మంది
పైగా 3,002 డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు, 5,819 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రహదారి భద్రతకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
