ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం..
- 122 మంది చిన్నారుల రక్షణ
- 53 కేసుల నమోదు..
- పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మం పోలీసు కమిషనరేట్ పరిధిలో నెల రోజుల పాటు నిర్వహించిన ‘ఆపరేషన్ ముస్కాన్–XII’ విజయవంతంగా ముగిసిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. జూలై 1 నుంచి 31 వరకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో మొత్తం 122 మంది చిన్నారులను రక్షించినట్లు వెల్లడించారు.
రక్షించిన వారిలో 110 మంది బాలురు, 12 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. వీరిలో తెలంగాణకు చెందిన 69 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన 53 మంది చిన్నారులను గుర్తించి రక్షించినట్లు చెప్పారు.
పోలీసులు, కార్మిక శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ), బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ), స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పరిశ్రమలు, హోటళ్లు, దుకాణాలు, నిర్మాణ ప్రదేశాలు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో బాల కార్మికులు, భిక్షాటన చేస్తున్న చిన్నారులు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పిల్లలను గుర్తించి రక్షించారు. రక్షించిన చిన్నారుల వివరాలను దర్పణ్ యాప్లో నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ ఆపరేషన్‌లో భాగంగా 53 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. రక్షించిన వారిలో 103 మంది చిన్నారులను వారి కుటుంబాలకు అప్పగించగా, మరో 19 మందిని బాలల సంరక్షణ గృహాలకు తరలించినట్లు చెప్పారు. తప్పిపోయిన చిన్నారులను గుర్తించి వారి కుటుంబాలకు చేర్చడం, బాల కార్మిక వ్యవస్థను అరికట్టడం, చిన్నారుల భద్రతను కాపాడడమే ఆపరేషన్ ముస్కాన్ ప్రధాన ఉద్దేశమని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.
