రాంపూర్ పంప్‌హౌస్ ప్రారంభాన్ని స్వాగతిస్తున్నాం
వరద కాలువ ద్వారా రైతులకు సాగునీరు అందించాలి: వేముల ప్రశాంత్ రెడ్డి
బాల్కొండ నియోజకవర్గం, ఆంధ్రప్రభ: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రాంపూర్ పంప్‌హౌస్ మోటార్లను ప్రారంభించి గోదావరి జలాలను ఎస్సారెస్పీ వరద కాలువలోకి ఎత్తిపోస్తుండడాన్ని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు అదే ప్రాజెక్టులో భాగమైన రాంపూర్ పంప్‌హౌస్‌ను వినియోగించడం ద్వారా కాళేశ్వరం అవసరాన్ని స్వయంగా అంగీకరించినట్లైందని ఆయన పేర్కొన్నారు.
గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు చేసిన ప్రభుత్వం నేడు రాంపూర్ పంప్‌హౌస్‌ను ప్రారంభించడం ద్వారా తమ విమర్శలకు భిన్నంగా వ్యవహరిస్తోందని అన్నారు.
రాంపూర్ పంప్‌హౌస్‌తో పాటు రాజేశ్వర్‌రావుపేట, ముప్కాల్ పంప్‌హౌస్‌లను కూడా వెంటనే ప్రారంభించి ఎస్సారెస్పీ వరద కాలువను పూర్తిస్థాయిలో నీటితో నింపాలని ప్రభుత్వాన్ని కోరారు. వరద కాలువ ద్వారా జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో సుమారు రెండు లక్షల ఎకరాలకు నిరంతర సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం ఎస్సారెస్పీలోకి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో లక్ష్మి, వేంపల్లి, బోదేపల్లి, చౌట్పల్లి, హన్మంత్‌రెడ్డి, గుత్ప, అలీసాగర్ లిఫ్ట్‌లను వెంటనే ప్రారంభించి చెరువులను నింపాలని డిమాండ్ చేశారు.
రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉండాలని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యాన్ని వినియోగించి తెలంగాణ రైతాంగానికి సమృద్ధిగా సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న అన్ని నీటిపారుదల వసతులను వినియోగించి రైతులకు మేలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
