పోషకాహార రంగం.. ఉపాధికి స్వర్ణద్వారం
- మహిళల ఆర్థిక సాధికారతకు వినూత్న మార్గాలు
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
(ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ) : పోషకాహార ఉత్పత్తులు, విలువ ఆధారిత ఆహార పదార్థాల తయారీ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ వంటి రంగాల్లో మహిళలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, మహిళల ఆర్థిక సాధికారతకు వీటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఎన్‌టీఆర్ జిల్లా-రైజ్.. నేటివ్ టేబుల్, ఫిక్కీ ఎఫ్ఎల్‌వో విజయవాడ సంస్థల భాగస్వామ్యంతో ఇబ్రహీంపట్నం మండలం, గుంటుపల్లి రైజ్ కేంద్రంలో శనివారం స్వయం సహాయక సంఘ మహిళలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరిగింది. పోషకాలు మెండుగా ఉండే బ్రౌన్ గుడ్ల ఉత్పత్తి విధివిధానాలపై అవగాహన కల్పించారు.
సహజ సిద్ధమైన పద్ధతుల్లో కోళ్ల పెంపకం చేపట్టడం, పోషకాలతో కూడిన గుడ్ల ఉత్పత్తి, మార్కెటింగ్ అంశాలను వివరించారు. యాంటీబయోటిక్స్‌ను ఉపయోగించకుండా కేవలం సహజమైన మేత, ఉన్నతమైన పోషకాలతో కోళ్లను ఎలా పెంచాలో వివరించారు. ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలకు నెలవైన గుడ్ల ఉత్పత్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సహజసిద్ధంగా పండించే ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, పండ్లు, కూరగాయలు, విలువ ఆధారిత ఆహార ఉత్పత్తులు శరీరానికి అవసరమైన పోషకాలను సమృద్ధిగా అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయని పేర్కొన్నారు.

ఇదే సమయంలో పోషకాహారానికి పెద్ద అండ అయిన గుడ్లను సమృద్ధిగా విటమిన్ డి, బీ12తో మరింత పోషకాల గనిగా మార్చేందుకు నేటివ్ టేబుల్ కృషిచేస్తోందన్నారు. సహజ ఆహార ఉత్పత్తులతో సుస్థిర ఆదాయం సమకూరడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతమవుతుందన్నారు.నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్‌కు అందించడం ద్వారా మహిళలు విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగవచ్చని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, సుమబిందు అట్లూరి (ప్రమాణ్ పౌల్ట్రీస్), నేటివ్ టేబుల్ మేనేజింగ్ పార్టనర్ చరిత మూల్పూరి తదితరులు పాల్గొన్నారు.
