Cotton-Crop : పత్తికి బెట్ట ..! Andhra Prabha Top Story
Cotton-Crop : పత్తికి బెట్ట ..! Andhra Prabha Top Story
- రైతన్న భద్రం
- పారాహుషార్
- పచ్చదోమ, తెల్లదోమ ప్రమాదం
- గోనెగండ్లలో పత్తి పంట పరిశీలన
( గోనెగండ్ల, ఆంధ్రప్రభ):
Cotton-Crop : ఎల్‌నినో ప్రభావంతో కొనసాగుతున్న బెట్ట పరిస్థితుల్లో పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారిణి పి.ఎల్. వరలక్ష్మి సూచించారు. గోనెగండ్ల మండలం హెచ్.కైరవాడి గ్రామంలో పత్తి పంటను మంగళవారం పరిశీలించిన ఆమె, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పంట సంరక్షణకు తీసుకోవాల్సిన శాస్త్రీయ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ పర్యటనలో ఎమ్మిగనూరు వ్యవసాయ సహాయ సంచాలకులు ఎస్.ఎం.డి. ఖాద్రి, కృషి విజ్ఞాన కేంద్రం (బనవాసి) కార్యక్రమ సమన్వయకర్త డా. కె. రాఘవేంద్ర చౌదరి, మండల వ్యవసాయ అధికారి హేమలత పాల్గొన్నారు.
అధికారులు మాట్లాడుతూ.. బెట్ట పరిస్థితుల కారణంగా పత్తి పంటలో పచ్చదోమ, తెల్లదోమ, పెనుబంక పురుగులు, తామర పురుగుల ఉధృతి పెరిగే అవకాశముందని తెలిపారు. వీటి నివారణకు ప్రతి ఎకరాకు 10 పసుపు రంగు జిగురు ట్రాప్‌లు, 10 నీలం రంగు జిగురు ట్రాప్‌లను పంట కంటే సుమారు ఒక అడుగు ఎత్తులో ఏర్పాటు చేయాలని సూచించారు.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు, అధిక ఉష్ణోగ్రతల వల్ల భూమి, మొక్కలలోని తేమ వేగంగా ఆవిరై మొక్కలు వాడిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఉదయం వేళల్లో 19:19:19 నీటిలో కరిగే ఎరువును లీటరు నీటికి 5 గ్రాములు లేదా నానో యూరియాను లీటరు నీటికి 2 నుంచి 4 మిల్లీలీటర్ల చొప్పున కలిపి ఆకులపై పిచికారీ చేయాలని సూచించారు.
పూత దశలో ఉన్న పత్తి పంటకు 19:19:19 లేదా 13:0:45 నీటిలో కరిగే ఎరువులను లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి ఆకులు పూర్తిగా తడిచేలా పిచికారీ చేస్తే బెట్ట పరిస్థితులను తట్టుకునే శక్తి పెరుగుతుందని వివరించారు.
రసం పీల్చే పురుగుల నివారణకు 10,000 పీపీఎం వేపనూనెను లీటరు నీటికి ఒక మిల్లీలీటరు లేదా 1,500 పీపీఎం వేపనూనెను లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు. పురుగుల ఉధృతి అధికంగా ఉంటే డైఫెన్థియురాన్ లేదా ఫ్లోనికామైడ్ మందులను సూచించిన మోతాదులో మార్చి మార్చి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలని తెలిపారు.
రైతులు పంటను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వ్యవసాయ శాఖ, కృషి విజ్ఞాన కేంద్రం సూచించే సమగ్ర పంట సంరక్షణ (ఐసీఎం) పద్ధతులను పాటిస్తే బెట్ట ప్రభావాన్ని తగ్గించి మెరుగైన దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారిణి వరలక్ష్మి పేర్కొన్నారు.
End
