ఎక్స్-రే సేవలను వెంటనే పునరుద్ధరించాలి

ఎక్స్-రే సేవలను వెంటనే పునరుద్ధరించాలి
- వైఎస్సార్‌సీపీ నాయకుల డిమాండ్
కృష్ణలంక, ఆంధ్ర ప్రభ: విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జనరల్) సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో ఎక్స్-రే సేవలు నిలిచిపోవడం పట్ల వైఎస్సార్‌సీపీ నాయకుల బృందం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆసుపత్రి లో డాక్టర్ మంగాదేవివని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా డాక్టర్ల విభాగం అధ్యక్షులు డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ గత కొంతకాలంగా ఎక్స్-రే యంత్రాలు పని చేయక పోవడంతో పేద, వృద్ధ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ సెంటర్లకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.
ఆసుపత్రి యంత్రాంగం వెంటనే స్పందించి, మరమ్మతుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఏజెన్సీల నిర్వాహకుల పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై పెనాల్టీలు విధించాలని లేదా వారి కాంట్రాక్టులను రద్దు చేసి, తక్షణమే సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్,తంగిరాల రామిరెడ్డి, గుండె సుందర్ పాల్ తను బుద్ది శేఖర్ రెడ్డి, బడిశ గణేష్ పాల్లొన్నారు.
