ఎమ్మిగనూరులో టౌన్, జూన్ 4 (ఆంధ్రప్రభ) : టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘వెన్నుపోటు దినం’ సందర్భంగా బుధవారం ఎమ్మిగనూరులో ఇంచార్జీ బుట్టా రేణుక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో రాష్ట్ర వీరశైవ లింగాయత్ విభాగ అధ్యక్షులు వై.రుద్ర గౌడ్, రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షులు బుట్టా ప్రతుల్, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు బుట్టా శివ నీలకంఠ వీరితో పాటు వేలాది మంది పార్టీ శ్రేణులు పాల్గొని నినాదాలతో కూటమి ప్రభుత్వ తీరును ఖండించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్, 143 హామీల అమలుపై విఫలమై ప్రజలను మోసం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కరోనా రాష్ట్రంలో ఇబ్బంది పెట్టినా మానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హమీని నెరవేర్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు.
“కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రతి వర్గాన్ని నిరాశపరిచింది. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం ‘రైతు భరోసా’, విద్యార్థుల కోసం ‘విద్యా దీవెన’, ‘వసతి దీవెన’, మహిళల కోసం ‘ఆడబిడ్డ నిధి’, తల్లికి వందనం, నిరుద్యోగులకు భృతి వంటి పథకాలన్నీ ఊహలకే పరిమితమయ్యాయి. సంవత్సరంలోనే ప్రతి ఒక్కరికి లక్షల్లో బకాయిలు ఏర్పడ్డాయి. పెన్షన్లు తగ్గించబడ్డాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. సంక్షేమం గాలికొదిలారని తీవ్రంగా విమర్శించారు.
అలాగే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై, నేతలపై, సామాజిక ఉద్యమకారులపై, జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టులు చేయడం కూటమి ప్రభుత్వ తీరును ఆమె ఎండగట్టారు. అధికారులను కూడా వేధించడమే కాకుండా, పలువురు ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేయడం కక్షసాధింపు చర్యలకే నిదర్శనమన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు తేవాలని చెప్పిన ప్రభుత్వం, నాశనం చేసిన పాలనను నెరవేరుస్తోంది. ఈ మోసపూరిత ప్రభుత్వ తీరుపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా తమ గళాన్ని వినిపించుకుంటున్నాం” అని బుట్టా రేణుక స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత అధ్యక్షులు శివప్రసాద్, నందవరం మండలం నాయకులు శివప్ప గౌడ్, గోనెగండ్ల మండలం నాయకులు నగేష్ నాయుడు, బందే నవాజ్, పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేషప్ప, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.