ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు..

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు..

27,360 మంది విద్యార్థుల‌కు 149 సెంట‌ర్లు.
వేస‌వి నేప‌థ్యంలో ప్ర‌త్యేక సౌక‌ర్యాల క‌ల్ప‌న‌.
మంచినీటి సౌక‌ర్యంతో పాటు వైద్య శిబిరాలు.
నో మొబైల్ జోన్లుగా ప‌రీక్షా కేంద్రాలు..
9154970454 నంబ‌రుతో జిల్లాస్థాయి కంట్రోల్ రూమ్‌..
ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామ‌ని.. ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులు స‌జావుగా ప‌రీక్ష‌లు రాసేందుకు సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై శుక్ర‌వారం కలెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. డీఈవో ఎల్‌.చంద్ర‌క‌ళ‌తో క‌లిసి క‌లెక్ట‌రేట్‌లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. 13,909 మంది బాలురు, 13,451 మంది బాలిక‌లు మొత్తం 27,360 మంది విద్యార్థుల‌కు 149 ప‌రీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. ఉద‌యం 9.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.45 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష జ‌రుగుతుంద‌ని.. విద్యార్థుల‌ను ఉద‌యం 8.30 గంట‌ల నుంచి అనుమ‌తించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

విద్యార్థులు ప‌రీక్షా కేంద్రానికి డిజిట‌ల్ వాచ్‌లు, ఇత‌ర ఎలక్ట్రానిక్ ప‌రిక‌రాలను తీసుకొని రాకూడ‌ద‌న్నారు. ప‌రీక్షా కేంద్రాల‌ను నో మొబైల్ జోన్లుగా ప్ర‌క‌టించ‌డం జ‌రిగిందని.. 144 సెక్ష‌న్ అమ‌లుచేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. వెయ్యి మీట‌ర్లలోపు జిరాక్సు షాపులు తెరిచి ఉండ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌క్కుండా ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. విద్యార్థులు హాల్ టిక్కెట్ చూపించి ఆర్‌టీసీలో ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం పొంద‌వ‌చ్చ‌న్నారు. ఎన్న‌డూ లేని విధంగా గౌర‌వ సీఎం, గౌర‌వ విద్యాశాఖ మంత్రివ‌ర్యుల దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా 100 రోజుల కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను ప‌టిష్టంగా అమ‌లుచేసి విద్యార్థుల‌ను పూర్తిస్థాయిలో ప‌రీక్ష‌ల‌కు స‌న్న‌ద్ధం చేశామ‌ని.. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాయ‌బోయే విద్యార్థుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు ల‌క్ష్మీశ తెలిపారు.

విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా జిల్లాస్థాయి కంట్రోల్ రూమ్ (9154970454) నంబ‌రుకు ఫోన్ చేయ‌వ‌చ్చ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌: డీఈవో ఎల్‌.చంద్ర‌క‌ళ‌ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని.. ప‌రీక్షా కేంద్రాల్లో ఫ‌ర్నిచ‌ర్‌, విద్యుత్ వ‌స‌తి, మంచినీరు, ఇత‌ర అవ‌స‌ర‌మైన అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించిన‌ట్లు డీఈవో ఎల్‌.చంద్ర‌క‌ళ తెలిపారు. హాల్ టిక్కెట్‌లో పొందుప‌రిచిన సూచ‌న‌లు పాటిస్తూ విద్యార్థులు స‌జావుగా ప‌రీక్ష‌లు రాసి మంచి మార్కులు సాధించాల‌న్నారు.

విద్యార్థులు త‌మ హాల్ టికెట్ నంబ‌రును ఆన్స‌ర్ స్క్రిప్ట్ లేదా ఓఎంఆర్ షీట్‌పై ఎక్క‌డా రాయ‌కూడ‌ద‌ని సూచించారు. 300 మంది సిబ్బందిని చీఫ్ సూప‌రింటెండెంట్లు, డిపార్ట్‌మెంట‌ల్ ఆఫీస‌ర్లుగా నియ‌మించ‌డం జ‌రిగింద‌న్నారు. 100 రోజుల ప్ర‌ణాళిక‌లో భాగంగా విద్యార్థుల స‌బ్జెక్టు నైపుణ్యాల‌ను పూర్తిస్థాయిలో మెరుగుప‌రిచి, ప‌రీక్ష‌ల‌కు స‌న్న‌ద్ధం చేసిన‌ట్లు డీఈవో ఎల్‌.చంద్ర‌క‌ళ తెలిపారు. ప్ర‌త్యేక అవ‌స‌రాలున్న (సీడ‌బ్ల్యూఎస్ఎన్‌) 193 మంది విద్యార్థుల‌కు స్కైబ్‌ల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని.. వీరికి గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ప‌రీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేశామ‌ని వివ‌రించారు.

Leave a Reply