పార్లమెంట్‌లో చర్చ జరగాలి..

పార్లమెంట్‌లో చర్చ జరగాలి..

భారత్–అమెరికా ఒప్పందంపై ప్రభుత్వం పారదర్శకంగా వివరణ ఇవ్వాలి..
వ్యక్తిగత విమర్శలు కాకుండా దేశ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలి
కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ ఇన్చార్జి వల్లూరు భార్గవ్

విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న ఈ సమయంలో భారత్,అమెరికా ఒప్పందం దేశ వ్యూహాత్మక ప్రయోజనాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉన్నందున పార్లమెంట్‌లో ఈ అంశంపై సార్ధకమైన చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ ఇన్‌చార్జి వల్లూరు భార్గవ్ పేర్కొన్నారు. విజయవాడలో మంగళవారం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రధాన దేశాలతో కుదుర్చుకునే ఒప్పందాలు దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని, అలాంటి నిర్ణయాల విషయంలో ప్రభుత్వం పూర్తి పారదర్శకత పాటించి స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్‌లో జరిగే చర్చలు విషయపరంగా స్పష్టంగా, బాధ్యతాయుతంగా ఉండాలని ఆయన సూచించారు.

ప్రతిపక్ష నాయకుడిపై వ్యక్తిగత విమర్శలు చేయడం లేదా రాజకీయ దృష్టి మళ్లించే వ్యాఖ్యలు చేయడం వల్ల దేశ ప్రజలకు అసలు విషయాలపై అవగాహన కలగదని అన్నారు. పార్లమెంట్‌లో కొత్తగా ప్రవేశిస్తున్న యువ ఎంపీలకు చర్చల నాణ్యతను పెంచే బాధ్యత ఉందని వల్లూరు భార్గవ్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నిస్తూ స్పష్టత కోరడం, దేశ సార్వభౌమత్వం మరియు దీర్ఘకాల ప్రయోజనాలను కాపాడే విధంగా వ్యవహరించడం వారి కర్తవ్యమని పేర్కొన్నారు. దేశానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై పార్లమెంట్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బాధ్యత వహించేలా చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ముఖ్యమని, జాతీయ ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీకి తావు ఉండకూడదని వల్లూరు భార్గవ్ స్పష్టం చేశారు.

Leave a Reply