బెల్ట్ షాపులపై ఎక్సైజ్ ఉక్కుపాదం
- ప్రత్యేక దాడుల్లో నలుగురు అదుపులోకి
- 30 మద్యం సీసాల స్వాధీనం
- పెనుగంచిప్రోలు, నందిగామలో కేసుల నమోదు
- అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తప్పవన్న అధికారులు
నందిగామ, ఆంధ్రప్రభ: అక్రమ మద్యం విక్రయాలు, బెల్ట్ షాపుల నిర్వహణపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నందిగామ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పెనుగంచిప్రోలు మండలంలో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో నలుగురిని అదుపులోకి తీసుకుని, 30 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ అధికారులు పెనుగంచిప్రోలు, అనిగండ్లపాడు, శివాపురం గ్రామాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం వెనుక భాగంలో మొబైల్ సేల్స్ షాపు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలను పట్టుకుని వారి వద్ద నుంచి 30 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
అదేవిధంగా నందిగామ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద అక్రమంగా మద్యం విక్రయాలకు పాల్పడుతున్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వారి పై కేసులు నమోదు చేశారు. ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎ. రమాదేవి, ఎస్‌ఐ గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్ట్ షాపుల నిర్వహణపై జిల్లావ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
