జిల్లాలో సాఫీగా సర్ ఇంటింటి సర్వే..
జిల్లాలో సాఫీగా సర్ ఇంటింటి సర్వే..
బీఎల్వోల ద్వారా 2,74,614 ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ
ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రక్రియ వేగవంతానికి నిరంతర పర్యవేక్షణ
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ-సర్ ప్రక్రియకు సంబంధించి ఇంటింటి సర్వే సాఫీగా జరుగుతోందని.. ఇప్పటివరకు బీఎల్వోల ద్వారా 2,74,614 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సర్ ప్రక్రియకు సంబంధించి జిల్లాలో 17,13,445 మంది ఓటర్లు ఉన్నారని.. బీఎల్వోలు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించడంతో పాటు వాటిని నింపి తిరిగి ఇవ్వడంలో సహకరిస్తున్నారన్నారు. అదేవిధంగా 10,870 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తయిందని వెల్లడించారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిలా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రక్రియను సజావుగా నిర్వహించడంలో ఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్వోలు కీలకపాత్ర పోషించేలా దిశానిర్దేశం చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో సగటున ఒక్కో బీఎల్వో పరిధిలో 956 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఇంటింటి సర్వేలో భాగంగా జులై 14వ తేదీ వరకు బీఎల్వోలు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తారని.. నింపిన వాటిని తిరిగి సేకరిస్తారని, ఇందుకు ప్రతి ఇంటికీ కనీసం మూడుసార్లు వెళ్లనున్నారని తెలిపారు. అర్హులను ఓటరు జాబితాలో ఉండేలా చేయడంతోపాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలసవెళ్లినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉండటం వంటి వారి ఓట్లను తొలగించి స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితా లక్ష్యంగా చేపట్టిన ఈ సర్ ప్రక్రియలో ప్రజలు చైతన్యవంతంగా కార్యక్రమంలో పాల్గొని బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు.
