అగ్ని ప్రమాదాల నివారణ అందరి బాధ్యత

అగ్ని ప్రమాదాల నివారణ అందరి బాధ్యత

మక్తల్ , ఆంధ్రప్రభ: అగ్ని ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మక్తల్ ఫైర్ స్టేషన్ ఎస్ఐ నరేష్ గౌడ్ అన్నారు. జాతీయ అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా బుధవారం రోజు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ లో ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులకు కరపత్రాలను పంపిణీ చేసి అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై నరేష్ గౌడ్ మాట్లాడుతూ.. ఒక అతి చిన్న నిపురవ్వను నిర్లక్ష్యం చేసిన అది ఘోరమైన ప్రమాదం కలిగించవచ్చు అన్నారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం కలిగించవచ్చని అంతేకాకుండా దేశ సంపద ధ్వంసం కావచ్చని అన్నారు. అందుకే అగ్ని విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండటం పనికిరాదని అన్నారు . అగ్ని ప్రమాద సమయంలోనే కాకుండా వరదలు సంభవించిన సమయంలో రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా తమ అగ్నిమాపక శాఖ ప్రజలకు సేవలందిస్తుందన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో తమ అగ్నిమాపక శాఖ 24 గంటలు ప్రజలకు సేవలు అందించేందుకు సన్నద్ధంగా ఉంటుందన్నారు. ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో ప్రాణనష్టం జరగకుండా కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఎక్కడ ఏ సమయంలో అగ్నిప్రమాదం జరిగినా తమకు సమాచారం అందించాల్సిందిగా ఆయన ప్రజలకు సూచించారు. స్కూల్స్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్ వంటి ప్రాంతాల్లో ఆర్సీసీ లేదా కాంక్రీట్ శ్లాబులు మాత్రమే పైకప్పుగా వాడాలన్నారు. తద్వారా ప్రమాదాల నివారణ సాధ్యమన్నారు. అవసరమైన ప్రదేశాలలో ఫైర్ అలారం ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఎఫ్ ఎఫ్ టి బి.అనంతయ్య ,ఎఫ్ ఎఫ్ టి. సి అశోక్,ఎఫ్ ఎఫ్ లు నర్సిములు ,వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply