Andesri Memorial | ఘట్‌కేసర్‌లో కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం రేవంత్

ప్రజాకవి సేవలకు గుర్తింపుగా స్మృతి వనం, విగ్రహం నిర్మాణం
అందెశ్రీ జయంతి సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమం

Andesri Memorial | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ప్రజాకవి అందెశ్రీ స్మృతులను చిరస్థాయిగా నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న స్మృతి వనం నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరగనుంది. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ సమీపంలో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని అందెశ్రీ స్మృతి వనం, విగ్రహ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రజాకవి అందెశ్రీ సేవలను గుర్తిస్తూ ఆయన సమాధి ప్రాంతాన్ని స్మృతి వనంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, ప్రజల భావోద్వేగాలను తన రచనల ద్వారా ప్రతిబింబించిన అందెశ్రీకి గౌరవంగా ఈ స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అందెశ్రీ మరణం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా అందెశ్రీ కుటుంబానికి అండగా ఉంటామని, స్మృతి వనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగానే తాజాగా నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతున్నారు.