BJP Telangana | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే లక్ష్యం
మేడ్చల్ జిల్లా కార్యవర్గ సమావేశం
బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై విమర్శలు..
కార్యకర్తలకు దిశానిర్దేశం
BJP Telangana | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : మేడ్చల్ జిల్లాలో నిర్వహించిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజల మధ్య నిరంతరం ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కారం కోసం కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ అభివృద్ధిలో విఫలమయ్యాయని ఆయన విమర్శించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగాల కల్పన, ఎన్నికల హామీల అమలు, ప్రజా సంక్షేమం వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిరాశపరిచిందని ఆరోపించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన ఎస్ఐఆర్ ప్రక్రియలో కార్యకర్తలు బాధ్యతగా, అప్రమత్తంగా వ్యవహరించాలని రాంచందర్‌రావు కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించడంతో పాటు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
