Operation Theatre | తెలుగు రాష్ట్రాల్లో వైద్యుల వినూత్న ప్రయోగాలు!
Operation Theatre | తెలుగు రాష్ట్రాల్లో వైద్యుల వినూత్న ప్రయోగాలు!
Operation Theatre | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఒకప్పుడు ఆపరేషన్ అంటే అమ్మో ఆపరేషనా… అని రోగితో పాటు రోగి బంధువులు కూడా ఎంతో ఆందోళన చెందేవారు. కానీ ఇప్పుడు సాంకేతికత పెరిగింది. క్లిష్టమైన ఆపరేషన్లను కూడా వైద్యులు ఎంతో సులువుగా చేస్తున్నారు. ఒకప్పుడు ఆపరేషన్ అంటే రోగికి పూర్తిగా మత్తుమందు ఇచ్చి చేసేవారు. కానీ ఇప్పుడు కొన్ని క్లిష్టమైన శస్త్రచికిత్సలను రోగి మెలకువగా ఉండగానే నిర్వహిస్తున్నారు. ఇలాంటి సర్జరీలు చేసేటప్పుడు వారు ఆందోళనకు గురికాకుండా ఉండేందుకు.. వారికి ఇష్టమైన హీరోల సినిమాలు చూపించడం లేదా సంగీత ప్రియులైతే పాటలు వినిపించడం వంటివి చేస్తుంటారు వైద్యులు. ఇటీవల కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలాంటి సర్జరీల సమయంలో రోగులు తమకు ఇష్టమైన సినిమాలు చూస్తూ వైద్యులకు సహకరించిన ఘటనలు వార్తల్లో నిలిచాయి.
తన అభిమాన హీరో సినిమా చూపిస్తూ..
హనుమకొండకు చెందిన ఒక మహిళకు గర్భాశయ సంబంధిత శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లిన తర్వాత ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. ఆమె భయాన్ని పోగొట్టడానికి వైద్యులు ఒక వినూత్న ప్రయత్నం చేశారు. ఆమెకు ఇష్టమైన హీరో వెంకటేష్ నటించిన ‘సూర్యవంశం’ సినిమాను మొబైల్‌లో ప్లే చేశారు. ఆ సినిమా చూస్తూ ఆమె ప్రశాంతంగా ఉండటంతో, వైద్యులు ఎటువంటి ఇబ్బంది లేకుండా శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. వైద్యులు రోగి మానసిక స్థితిని అర్థం చేసుకుని, ఇలా వినూత్నంగా వ్యవహరించడం పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు వ్యక్తమయ్యాయి.

పవన్ కళ్యాణ్ ‘OG’ చూస్తూ..
ఇటీవల గుంటూరు జిల్లా వడ్లమూడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 45 ఏళ్ల కోటేశ్వరమ్మకు మెదడు ట్యూమర్ (బ్రెయిన్ ట్యూమర్) తొలగించే శస్త్రచికిత్స నిర్వహించారు. ట్యూమర్ మెదడులోని కీలక భాగానికి దగ్గరగా ఉండటంతో, వైద్యులు ‘అవేక్ క్రానియోటమీ’ (రోగి మెలకువగా ఉండగా చేసే బ్రెయిన్ సర్జరీ) చేయాలని నిర్ణయించారు. ఈ సమయంలో ఆమెకు ఇష్టమైన నటుడు పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ సినిమాను ప్రదర్శించారు. సినిమా చూస్తూనే ఆమె వైద్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ సహకరించగా, శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది.

గతంలో జరిగిన ఇలాంటి ఘటనలు..
జూనియర్ ఎన్టీఆర్ ‘అదుర్స్’తో ధైర్యం..
2024లో కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో 55 ఏళ్ల అనంతలక్ష్మికి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేశారు. అవేక్ క్రానియోటమీ సమయంలో ఆమెకు ఇష్టమైన జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘అదుర్స్’ సన్నివేశాలను ప్రదర్శించారు. దీంతో ఆమె ప్రశాంతంగా ఉండటమే కాకుండా, వైద్యులకు అవసరమైన సూచనలు ఇవ్వగలిగింది. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది.
రామమందిర ప్రతిష్ఠ కార్యక్రమం చూస్తూ ఆపరేషన్..
గుంటూరులో మరో అరుదైన ఘటన చోటుచేసుకుంది. 29 ఏళ్ల మణికంఠకు మెదడులోని ట్యూమర్ తొలగించే శస్త్రచికిత్స నిర్వహించే సమయంలో, ఆయన అభ్యర్థన మేరకు అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వీడియోను ప్రదర్శించారు. భక్తిభావంతో ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ రోగి ప్రశాంతంగా ఉండటంతో సర్జరీ సాఫీగా పూర్తయిందని వైద్యులు తెలిపారు.

పవన్ కళ్యాణ్ ‘OG’ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ‘అదుర్స్’ వరకు.. తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు కేవలం వినోదానికే కాదు, క్లిష్టమైన శస్త్రచికిత్సల సమయంలో రోగులకు ధైర్యాన్ని అందించే సాధనంగా కూడా మారడం విశేషం. వైద్య రంగంలో జరుగుతున్న ఈ వినూత్న ప్రయోగాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.
