వైభవంగా శ్రీ వేంకటేశ్వరుని నిత్య కళ్యాణం

  • ఘనంగా నవ కలశ పూర్వక పంచామృతాభిషేకం
  • ఉత్సహంగా స్వామివారి తిరువీధి ఉత్సవం

ఆంధ్రప్రభ ప్రతినిధి, యాదాద్రి : భువనగిరి పట్టణ కేంద్రంలోని స్వర్ణగిరి క్షేత్రంలో రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ మదన వేణుగోపాల స్వామికి పాలు, పెరుగు, తేనె,చక్కర, పండ్ల రసాలు, పసుపు, కుంకుమ, చందనాదులతో నవ కలశ పూర్వక పంచామృతాభిషేకం ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రాతఃకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించారు.

సుప్రభాతసేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు,ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించారు. స్వామి వారిని మని మయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళభరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి వేయి నామాల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు.

వైభవోస్తావ మండపంలో స్వామి కళ్యాణోత్సవం..

విశ్వేశ్వరుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి అర్చక స్వాములు స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా సుమారు 5వేల మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

ఆదిమధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయ మానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు.భక్తులు నయనానందకరంగా శ్రీవారినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.