చిత్తూరులో కన్నన్ విద్యాసంస్థల బాలికల హాస్టల్ ప్రారంభం

  • రూ.1.10 కోట్లతో నిర్మాణం..
  • 120 మంది విద్యార్థినులకు వసతి..
  • క్రీడా వసతుల అభివృద్ధికి మరో రూ.25 లక్షల ప్రణాళిక

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు పట్టణంలోని చారిత్రాత్మక కన్నన్ విద్యాసంస్థలో బాలికల కోసం నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ప్రారంభించారు. బాలికలకు సురక్షితమైన వసతి కల్పించడం ద్వారా వారి విద్యాభ్యాసానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని, ముఖ్యంగా పేద కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

శనివారం ఉదయం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చుడా చైర్‌పర్సన్ కటారి హేమలత, పాఠశాల ప్రిన్సిపాల్ సయ్యద్ మౌలా తదితరులతో కలిసి జిల్లా కలెక్టర్ హాస్టల్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, పూర్వ విద్యార్థుల సంఘం, ప్రజాప్రతినిధులు, దాతల సమిష్టి కృషితో ఈ హాస్టల్ నిర్మాణం పూర్తయిందన్నారు. ప్రస్తుతం సుమారు 120 మంది విద్యార్థినులకు సురక్షితమైన వసతి కల్పించే అవకాశం ఏర్పడిందని తెలిపారు. బయట అద్దె గదుల్లో ఉండే విద్యార్థినులకు ప్రతి నెల వేల రూపాయల ఖర్చు తగ్గడంతో పాటు భద్రత కూడా లభిస్తుందని చెప్పారు.

హాస్టల్ అందుబాటులోకి రావడంతో విద్యార్థినుల ప్రవేశాలు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రెండేళ్ల పాటు పూర్వ విద్యార్థులు విద్యాసంస్థ అభివృద్ధికి అండగా నిలవాలని కోరారు. పాఠశాల క్రీడా మైదానం అభివృద్ధి, రన్నింగ్ ట్రాక్, లైటింగ్, ఇతర క్రీడా సౌకర్యాల కోసం రూ.25 లక్షలతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ, దాదాపు 97 ఏళ్ల చరిత్ర కలిగిన కన్నన్ విద్యాసంస్థలో చదువుకునే పేద విద్యార్థినుల కోసం హాస్టల్ నిర్మించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దాతల సహకారం, ట్రస్టుల నిధులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో సుమారు రూ.1.10 కోట్ల వ్యయంతో నాణ్యత ప్రమాణాలతో హాస్టల్ నిర్మాణం పూర్తయిందన్నారు. ఈ హాస్టల్ ద్వారా ప్రతి విద్యార్థినికి ఏటా రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు. నిర్మాణాన్ని నాణ్యతతో పూర్తి చేసిన కాంట్రాక్టర్‌ను అభినందించారు.

తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, కన్నన్ విద్యాసంస్థ నుంచి అనేక మంది కలెక్టర్లు, వైద్యులు, ఇంజినీర్లు, ప్రజాప్రతినిధులు తయారయ్యారని గుర్తు చేశారు. బాలికల హాస్టల్ అవసరాన్ని గుర్తించి జిల్లా కలెక్టర్ చొరవతో ప్రజాప్రతినిధులు, దాతలు కలిసి ఈ భవనాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా విద్యాసంస్థ అభివృద్ధికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

చుడా చైర్‌పర్సన్ కటారి హేమలత మాట్లాడుతూ, పూర్వ విద్యార్థుల సంఘం విజ్ఞప్తికి స్పందించిన జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధుల కృషితో హాస్టల్ నిర్మాణం సాధ్యమైందన్నారు. హాస్టల్ ఏర్పాటు వల్ల విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు బాలికలకు మెరుగైన, సురక్షితమైన వసతి లభిస్తుందని చెప్పారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, దాతలు సమిష్టిగా కృషి చేస్తే ప్రభుత్వ విద్యాసంస్థలను మరింత అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు.

కార్యక్రమంలో హెడ్మాస్టర్ జి. కోమల, కాంట్రాక్టర్ ఆనందన్, చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు షణ్ముఖ రెడ్డి, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.