- తొలి ప్రపంచ కప్ ముద్దాడిన టీమిండియా
ముంబై : మహిళల వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికా జట్టుపై అద్భుత ప్రదర్శన కనబరిచిన హర్మన్ సేన.. సఫారీలను 246 పరుగులకే కుప్పకూల్చి 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టీమిండియా తొలిసారిగా ప్రపంచకప్ విజేతగా నిలిచింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 298 పరుగులు చేసింది. ప్రపంచకప్ ఫైనల్లో భారత్ తరఫున (పురుషులు, మహిళలు కలిపి) ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. బ్యాటింగ్‌లో సత్తా చాటిన హర్మన్ సేన బౌలింగ్‌లోనూ అదరగొట్టింది. ప్రత్యర్థి బ్యాటర్లను వరుసగా ఔట్ చేస్తూ సఫారీలకు షాక్ ఇచ్చింది.

షఫాలీ వర్మ.. ది గేమ్ ఛేంజర్ !
ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మలు ఘనమైన ఆరంభాన్ని అందించారు. ఇద్దరి జోడీ 104 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. మంధాన 45 పరుగులతో నిలువగా, షఫాలీ వర్మ 78 బంతుల్లో 87 పరుగులు చేసి గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. జెమీమా రోడ్రిగ్స్ (24), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20) కీలక ఇన్నింగ్స్ ఆడారు. మధ్యలో దీప్తీ శర్మ అద్భుతంగా రాణిస్తూ 58 పరుగులు చేసింది. రిచా ఘోష్ (34) వేగంగా ఆడడంతో భారత్ బలమైన స్కోరును అందుకుంది.
సౌతాఫ్రికా బౌలర్లలో అయబోంగా ఖాఖా మూడు వికెట్లు తీయగా, మ్లాబా, డి క్లెర్క్, ట్రయాన్ తలో వికెట్ తీశారు.
వోల్వార్ట్ ఒంటరి పోరాటం…
ఇక, 299 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు ఆరంభం నుంచే ఒత్తిడిని ఎదుర్కొంది. తజ్మిన్ బ్రిట్స్ (23) రనౌట్ కావడంతో జట్టు బ్యాటింగ్ క్రమం కుదేలైంది. కెప్టెన్ లారా వోల్వార్ట్ ఒంటరిగా ప్రతిఘటిస్తూ అద్భుతమైన శతకం (101) సాధించింది. కానీ ఇతర బ్యాటర్లు పెద్దగా సహకరించలేదు. సునే లూస్ (25), డెర్క్సెన్ (35), సినాలో జాఫ్టా (16) తప్ప మిగతావారు విఫలమయ్యారు.
భారత బౌలర్లలో దీప్తీ శర్మ 5 వికెట్లు (5/39) తీయగా, నల్లపురెడ్డి చరణి 1/48తో మెరిశారు. బ్యాటింగ్‌లో రాణించిన షఫాలీ వర్మ బౌలింగ్‌లోనూ సత్తా చాటుతూ 2/36 సాధించింది. భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా 246 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 52 పరుగుల తేడాతో గెలిచి చారిత్రక విజయం సాధించింది.
రెండు సార్లు ఫైనల్ చేరి కప్ కోల్పోయిన భారత్, మూడో సారి ఆ కలను నిజం చేసుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సేన తొలి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని భారత మహిళల క్రికెట్ చరిత్రలో బంగారు అక్షరాలతో పేరు లిఖించుకుంది.

