వికారాబాద్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్‌లో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువ చైతన్యం ట్రస్ట్ చైర్మన్, అడ్వకేట్, బీఆర్ఎస్ నాయకులు శ్రీ చైతన్య కిరణ్ గారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ గారు కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాకుండా భారతదేశానికి జ్ఞానం, సమానత్వం, న్యాయం అనే మూడు మూల సూత్రాలను అందించిన మహానేత అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, గౌరవం కల్పించే గొప్ప గ్రంథమని, అది భారతదేశాన్ని శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టిందని తెలిపారు.
భారత అభివృద్ధి విద్య, అవగాహన, సామాజిక న్యాయం మీద ఆధారపడి ఉంటుందని, అంబేద్కర్ ఆలోచనలు యువతకు మార్గదర్శకమని అన్నారు. సమాజంలో ఇంకా ఉన్న అసమానతలను తొలగించేందుకు యువత ముందుండాలని, జ్ఞానం ద్వారానే నిజమైన స్వేచ్ఛ సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు.
“ఎడ్యుకేట్, అగిటేట్, ఆర్గనైజ్” అనే అంబేద్కర్ సందేశం ప్రతి యువకుడి జీవితంలో ఆచరణలో ఉండాలని ఆయన సూచించారు. సమాజంలో సమానత్వం కోసం పోరాటం ఆగకూడదని, యువతే ఆ మార్పుకు నాంది పలకాలని తెలిపారు.
సమానత్వం, హక్కులు, గౌరవం – ఇవే నిజమైన భారతదేశం పునాదులు అని, వాటిని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ గౌడ్, నరసింహులు, విక్రం తదితరులు పాల్గొన్నారు. “అంబేద్కర్ ఆలోచనలే మార్పుకు మార్గం – జ్ఞానమే శక్తి” అని ఆయన పేర్కొన్నారు.
