Sangareddy | పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ క్రాంతి వల్లూరు

సంగారెడ్డి, ఫిబ్రవరి 27 (ఆంధ్రప్రభ) : సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని తారా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఎన్నికల సరళని, ఎన్నికల ఏర్పాట్లను, పోలింగ్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడారు. శాసనమండలి గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎన్నికల పోలింగ్ కోసం సంగారెడ్డి జిల్లాలో అన్ని ఏర్పాట్లను చేసామన్నారు. శాసన మండలి పట్టభద్రుల నియోజవర్గానికి సంబంధించి జిల్లాలో 25,652 మంది ఓటర్లు ఉండగా, ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లు 2,690 మంది ఉన్నారని వివరించారు. ఈ మేరకు పట్టభద్రుల నియోజకవర్గానికి 40పోలింగ్ కేంద్రాలను, ఉపాధ్యాయ సెగ్మెంట్ కు 28 పోలింగ్ కేంద్రాలను కలుపుకుని జిల్లాలో మొత్తం 68 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.

4రెవెన్యూ డివిజన్లు, 28రెవెన్యూ మండలాలతో పాటు మున్సిపల్ పట్టణాల్లో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఓటర్ల సౌలభ్యం కోసం ఉపాధ్యాయ, పట్టభద్రుల పోలింగ్ స్టేషన్లు దాదాపు ఒకే ప్రాంగణంలో ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక పీఓ, ఒక ఏపీఓ, ఇద్దరు ఓపీఓల చొప్పున నలుగురు అధికారులతో కూడిన బృందం పోలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. 68 పోలింగ్ కేంద్రాలకు సరిపడా పోలింగ్ సిబ్బందిని నియమించడంతో పాటు మరో 20శాతం అదనపు సిబ్బందిని కూడా రిజర్వ్ లో ఉంచామన్నారు.

పోలింగ్ ముగిసిన మీదట బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత నడుమ కరీంనగర్ లోని రిసెప్షన్ సెంటర్ కు చేర్చడం జరుగుతుందన్నారు. ఎన్నికల నియమావళి తు.చ తప్పకుండా అమలయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. 27న ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 4.00గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కలిగి ఉన్న ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, స్వేచ్చాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్డీవో రవీందర్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మార్వో దేవదాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *