ఔషధ మొక్కల సాగుతో అత్యధిక ఆదాయం

ఔషధ మొక్కల సాగుతో అత్యధిక ఆదాయం

  • అయోధ్యలో కరుణాకర్ ఆధ్వర్యంలో వ్యవసాయ సదస్సు
  • తీరగ్రామాల్లో వట్టి వేర్ల సాగు అవకాశాలు పరిశీలిస్తాం
  • సేంద్రియ సాగు విధానాలతో అద్భుతమైన ఫలితాలు
  • ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
  • వట్టివేర్లు, అరటి, అలోవెరాతో అత్యధిక ఆదాయం
  • ఎకో గ్రీన్ యూనిట్ ఫౌండేషన్ చైర్మన్ ఎస్.కే.బాబు

మోపిదేవి, ఆంధ్రప్రభ: ఔషధ మొక్కల సాగుతో అత్యధిక ఆదాయం పొందవచ్చని, దివిసీమలోని తీరగ్రామాల్లో వట్టి వేర్ల సాగు అవకాశాలు పరిశీలిస్తామని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. బుధవారం మోపిదేవి మండల పరిధిలోని అయోధ్యలో సేంద్రియ రైతు, అయోధ్య ఫామ్స్ నిర్వాహకులు కోనేరు కరుణాకర్ ఆధ్వర్యంలో వ్యవసాయదారుల సదస్సు నిర్వహించారు. వట్టి వేరు, అలొవిరా, అరటి, గోబర్ గ్యాస్, మునగ ఆకుతో పొడి, బొగ్గు, నలభై రకాల వ్యవసాయ ఉత్పత్తులపై నిపుణులతో చర్చ నిర్వహించారు.

ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ సేంద్రియ సాగు విధానాలతో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయన్నారు. కోయంబత్తురులో ఎకో గ్రీన్ యూనిట్ ఫౌండేషన్ ద్వారా ఎస్.కే.బాబు నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రం, తరకటూరులో విజయరామ్ నిర్వహిస్తున్న వ్యవసాయ క్షేత్రం సందర్శించి రైతులకు మేలు చేసే విధానాల అమలుకు కృషి చేస్తామన్నారు.

వ్యవసాయ, ఉద్యానవన శాఖల్లో ఉన్న అధికారులు, సిబ్బంది, రైతులు తరకటూరు సందర్శించి అక్కడ విధానాలు తెలుసుకోవాలని సూచించారు. తద్వారా రైతులకు మేలు చేయాలని కోరారు. వట్టి వేళ్ళు, అరటి, సీ-అలోవెరా ఉత్పత్తి చేస్తే ఎకో గ్రీన్ యూనిట్ ఫౌండేషన్ ద్వారా ఎస్.కే.బాబు రైతులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలు చూపేందుకు ముందుకు రావటం విశేషం అన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు అనునిత్యం అండగా నిలుస్తుందని, ఇటీవల మోపిదేవి మండలంలో టమాటా రైతులు ఎదుర్కొన్న సమస్యను పరిష్కరించి, ఇప్పటికి 5400 మెట్రిక్ టన్నుల టమాటా విక్రయాలు సుగమం చేసినట్లు తెలిపారు.

ఎకో గ్రీన్ యూనిట్ ఫౌండేషన్ – కోయంబత్తురు చైర్మన్ ఎస్.కే.బాబు మాట్లాడుతూ వట్టివేర్లు, అరటి, అలోవెరాతో అత్యధిక ఆదాయం లభిస్తుందన్నారు. వట్టి వేళ్ళ సాగుతో అత్యధిక ఆదాయ మార్గాలు ఉన్నాయని తెలిపారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా వక్క ఆకులతో భోజనం, టిఫిన్ బఫే ప్లేట్లు, గాలిపంకాలు తయారు చేయవచ్చని తెలిపారు. సీ-అలోవెరా ఉత్పత్తితో ప్రయోజనాలు వివరించారు. సీ-అలోవెరా జంతువుల చర్మానికి ప్రత్యామ్నాయంగా నిలిచి వేగన్ లెదర్ తయారీకి ఉపయోగపడుతుందన్నారు. తద్వారా లభించే ఆదాయ మార్గాలు వివరించారు. అరటి చెట్టు నారతో తయారు చేసే అనేక ఉత్పత్తుల వినియోగం పెరిగిన నేపథ్యంలో అరటి చెట్టు నారతో ఆదాయం పొందే మార్గాలు, ఉపాధి అవకాశాలు వివరించారు.

సేంద్రియ వ్యవసాయ రైతు ప్రముఖులు తరకటూరు విజయరామ్ మాట్లాడుతూ తాను అనుసరిస్తున్న సాగు విధానాలు వివరించారు. వట్టి వేరుతో ఆదాయ మార్గాలు వివరించారు. మానసిక ప్రశాంతతకు వినియోగించే ఆల్కలైన్ వాటర్ తయారీకి వట్టి వేళ్ళు వినియోగిస్తారని తెలిపారు. ఈ సందర్బంగా విజయరామ్ తన వ్యవసాయ క్షేత్రంలో పండించిన ఉత్పత్తులు ఎమ్మెల్యేకు చూపించారు.

బెల్లం తయారీ పరిశీలన:
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అయోధ్యలోని కోనేరు కరుణాకర్ నిర్వహిస్తున్న సేంద్రియ బెల్లం తయారీ ప్లాంట్ సందర్శించి ఆయనను అభినందించారు.

కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, సర్పంచ్ అరజా సంధ్యారాణి, పీఏసీఎస్ చైర్మన్ అరజా రాధిక, జిల్లా ఉద్యాన శాఖ అధికారి జే.జ్యోతి, తహసీల్దార్ ముప్పిరిశెట్టి హరనాధ్, ఏడీఏ జే.ఎస్.జయప్రద, హెచ్ఓ నల్లగట్ల రమేష్, ఆరు మండలాల ఏఓలు కే.మురళీ కృష్ణ, హెప్సిబా రాణి, టీ.శుభ హారిక, డీ.అనూష, సంజీవ్ కుమార్, శ్రీధర్, ఏఈఓలు, వీఏఏలు, 3ఎఫ్ ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Leave a Reply