అప్రమత్తతతో ప్రాణం కాపాడిన రైల్వే సిబ్బంది..
అప్రమత్తతతో ప్రాణం కాపాడిన రైల్వే సిబ్బంది..
కదులుతున్న రైలు నుంచి పడిపోయిన ప్రయాణికుడికి సకాలంలో సాయం
300 మీటర్లు రైలును వెనక్కి తీసుకెళ్లి రక్షించిన సిబ్బంది
తెనాలి స్టేషన్లో వైద్య చికిత్స కోసం అప్పగింత
దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ ప్రశంసలు
విజయవాడ, ఆంధ్రప్రభ : కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు పడిపోయిన ఓ ప్రయాణికుడి ప్రాణాలను రైల్వే సిబ్బంది అప్రమత్తత, సమయస్ఫూర్తితో కాపాడిన ఘటన దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో చోటుచేసుకుంది. రైలు నంబర్ 16031 ప్రయాణిస్తున్న సమయంలో అలారం చైన్ పుల్లింగ్ (ఏసీపీ) సంకేతం అందడంతో రైలు సిబ్బంది భద్రతా నిబంధనల మేరకు రైలును నిలిపివేశారు. అనంతరం బిట్రగుంట డిపోకు చెందిన ట్రైన్ మేనేజర్ కె. సంపత్ కుమార్‌కు ఒక పురుష ప్రయాణికుడు కదులుతున్న రైలు నుంచి జారిపడి పట్టాల పక్కన గాయాలతో పడి ఉన్నట్లు సమాచారం అందింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన లోకో పైలట్ వి. సుబ్బారావు, సహాయ లోకో పైలట్ ఎల్.వి. గోపాల్, ట్రైన్ మేనేజర్ కె. సంపత్ కుమార్‌లు వెంటనే చర్యలు చేపట్టారు.
అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తూ రైలును సుమారు 300 మీటర్లు వెనక్కి తీసుకెళ్లి గాయపడిన ప్రయాణికుడిని గుర్తించారు. పట్టాల పక్కన గాయాలతో ఉన్నప్పటికీ స్పృహలోనే ఉన్న ప్రయాణికుడిని సురక్షితంగా రైలులోకి ఎక్కించి ప్రాథమిక సహాయం అందించారు. తదుపరి స్టేషన్ చేరుకునే వరకు అతని ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు. రైలు తెనాలి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న అనంతరం గాయపడిన ప్రయాణికుడిని స్టేషన్ మాస్టర్‌కు అప్పగించి వైద్య చికిత్స, తదుపరి సహాయక చర్యల కోసం ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనలో రైల్వే సిబ్బంది చూపిన అప్రమత్తత, సమన్వయం, మానవత్వం ప్రశంసనీయమని దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ పేర్కొంది. ప్రయాణికుల భద్రతే రైల్వే ప్రధాన లక్ష్యమని, ప్రమాద పరిస్థితుల్లో సిబ్బంది చూపిన సేవా దృక్పథం అందరికీ ఆదర్శమని అభినందించింది. ఫుట్‌బోర్డ్ ప్రయాణం, కదులుతున్న రైలులో ఎక్కడం లేదా దిగడం, తలుపుల వద్ద నిలబడటం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని రైల్వే అధికారులు సూచించారు. సురక్షిత ప్రయాణం కోసం కోచ్లోపలే ఉండి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
