100 శాతం పన్ను వసూళ్ల పై దృష్టి సారించాలి…

100 శాతం పన్ను వసూళ్ల పై దృష్టి సారించాలి…

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : గ్రామాలలో 100% పన్ను వసూళ్ల పై అధికారులు దృష్టి సారించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. గురువారం జి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పంచాయతీ శాఖ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి నిర్మాణం యొక్క అసెస్మెంట్ 100 శాతం పూర్తి చేయాలని, ప్రతి ఇంటి నుంచి ఆస్తి పన్ను తప్పనిసరిగా వసూలు చేయాలన్నారు. గ్రామాలలో అక్రమ నిర్మాణాలు జర్గకుండా చర్యలు తీసుకోవాలని, అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణాలకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు.

మండల కేంద్రాలలో ఉన్న వ్యాపార సంస్థల సంపూర్ణ వివరాలు దగ్గర అందుబాటులో ఉండాలని, ఆస్తి పన్ను చెల్లించని పక్షంలో రైస్ మిల్లర్లు, ఇతర వాణిజ్య కార్యక్రమాలను మూసి వేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆర్టిసి బస్ స్టాండ్, ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాలు కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుందని, పెండింగ్ ఉన్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా డిమాండ్ నోటీసులు జారీ చేయాలన్నారు. గ్రామాలలో అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయాలని లేని పక్షంలో తొలగించాలన్నారు.

రోడ్ల పై చెత్త ఉండకుండా రెగ్యులర్ పారిశుధ్య చర్యలు తీసుకోవాలని, గ్రామాలలో ఖాళీ స్థలంలో చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని, మధ్యం షాపుల వద్ద చెత్త ఉంటే భారీ స్థాయిలో జరిమానాలు విధించి సేకరించాలని తెలిపారు. ఏప్రిల్ 2న జరిగే గ్రామ సభ కు పటిష్ట ఏర్పాట్లు చేయాలి, గ్రామ సభ లో ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా అమలు చేస్తున్న వివిధ పథకాల వివరాలు, గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి పనులను, ఆర్థిక సంఘం నిధుల వినియోగం పై ప్రజలకు వివరించాలన్నారు.

గ్రామ సభ కార్యక్రమం పై ముందస్తుగానే ప్రచారం చేయాలని, ఏప్రిల్ 16 న మండల స్థాయిలో నిర్వహించే కార్యక్రమానికి ప్రజలకు స్వశక్తి మహిళా సంఘాల బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ, వ్యవసాయ యాంత్రీకరణ, వివిధ శాఖలలో ఏమైనా ఆస్తుల పంపిణీ ఉంటే ఆరోజు పెట్టుకోవాలని, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాలని, స్థానిక ప్రజాప్రతినిధులను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, డి ఎల్ పి ఓ లు, ఎంపీ ఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.