14thJunechintana | కృష్ణుడు చెప్పిన ఆప్యాయత vs ఆడంబరం

14thJunechintana | కృష్ణుడు చెప్పిన ఆప్యాయత vs ఆడంబరం

14thJunechintana | గృహస్థాశ్రమం మరియు ధర్మంలోని గొప్పతనం
విదురుడు–దుర్యోధన ఉదాహరణలో విశ్వాసం మరియు అహంకారం
శబరి ప్రేమలోని నిజమైన విలువలు
సంస్థల జీవితంలో నాయకత్వం, నమ్మకం, భద్రత పాత్ర

14thJunechintana | భారతీయ సనాతన సంప్రదాయంలో గృహస్థాశ్రమం ఉదాత్తమైనది. సమాజానికి ఆధారంగా నిలిచేది గృహస్థుడే అని పెద్దలు చెబుతారు. ఎలాగైతే తల్లి నాశ్రయించుకొని జంతువులు జీవిస్తాయో అలాగే గృహస్థును ఆశ్రయించి మానవులు జీవిస్తారంటారు. గృహస్థు ఇచ్చే ఆతిథ్యమే మిగతా మూడు ఆశ్రమాల వారికి ఆధారం. అందుకే గృహస్థాశ్రమాన్ని ధర్మంలో అత్యున్నత స్థాయిలో చెప్పారు. గృహస్థాశ్రమం లేనిదే మోక్షం లేదని సనాతన ధర్మం చెబుతున్నది. ధర్మం అనేది కేవలం ఆచారం కాదు.. అంతరంగ శుద్ధతకు, పవిత్రతకు ప్రతీక. ఇంటికి వచ్చిన అతిథిని సగౌరవంగా ఆహ్వానించి, కడుపునిండుగా భోజనం పెట్టడం సనాతన ధర్మ ఆచారం.

తన ఇంటికి పిలిచి ప్రేమతో పెట్టే భోజనం (ప్రేమ, భక్తి గలుగుకూడు) మంచి భోజనం. ఆపద సమయంలో ఔను, కాదని చెప్పలేని పరిస్థితులలో కటకటపడుతూ ప్రేమాదులు ఏమీలేకుండా తప్పదని పెట్టే కూడు కూడా ఉచితమైనదే. ఆ రెండూ ఆమోదయోగ్యమని ఉద్యోగపర్వంలో కృష్ణుడు చెబుతాడు. అలాగే తనపై ప్రేమాభిమానాలు లేకుండా ఆడంబరంకై పెట్టే కూడు సరైనది కాదు అంటాడు కృష్ణుడు. దానికి కారణాన్ని కూడా చెప్పాడు. ఇష్టంకాని వారి ఇంటిలో వారు ఏమి పెడతారో అనే అనుమానం కలుగుతుంది. అమృతం పెట్టినా తినేవారికి ఏదైనా అపకారం జరిగితే యజమానికి అపకీర్తి వస్తుంది. అందుకే విశ్వాసం లేనివారి ఇంట భుజించడం యుక్తం కాదంటాడు కృష్ణుడు.

కౌరవుల వద్దకు రాయబారిగా వెళ్ళిన కృష్ణుడు.. దుర్యోధనుని ఇంటి రాజభోజనాన్ని కాదని విదురుని ఇంట భోజనం చేసాడు. నిజానికి కృష్ణుడు తిరస్కరించింది కేవలం దుర్యోధనుడి భోజనం కాదు.. అతనిలోని అహంకారంను. అలాగే ఆయన అంగీకరించింది కేవలం విదురుని ఆహారాన్ని కాదు.. విదురుని హృదయాన్ని. భోజనం, అదెంత విలువైనదైనా కేవలం కొన్ని గంటలలో మలంగా మారిపోతుంది. అతిథికి కావలసింది గృహస్థుయొక్క ఆప్యాయతలు, అనురాగాలే కానీ ఎంత విలువైన భోజనమన్నది కాదు. బయట వైభవోపేతంగా కనిపిస్తున్నా అంతరంగంలో భయం, అనుమానం కలిగిన భోజనం వర్ణనీయమే. అందుకే దుర్యోధనుడి రాజమందిరం కంటే విదురుని ఇల్లు చిన్నదైనా గొప్పదిగా భావించి కృష్ణుడు భుజించాడు.

రామాయణంలో శ్రీరాముడు శబరి ఇచ్చిన ఫలాలను ఆప్యాయంగా ఆరగించాడు. ఆమెకు సంపదలేదు, ఎత్తైన చలువరాతి భవనాలు లేవు. సాధారణ వనవాసి అయినా ఆమె చూపిన ప్రేమ అసాధారణమైనది. ఆమె ఇచ్చిన పండ్ల యొక్క విలువ ఆ ఫలాల రుచిలో కాదు… ఆమె చూపిన ఆప్యాయతలో ఉన్నది. నిజానికి విలువలు గల వ్యక్తులు లేదా సంస్థలు మాత్రమే దీర్ఘకాలంలో గౌరవాన్ని సంపాదించుకుంటాయి.

ఒక ఊరిలో రెండు హోటళ్లు ఉండేవి. ఒకటి పెద్ద భవనం, ఖరీదైన అలంకరణలతో ఉన్నది. కానీ అక్కడ యజమాని ఉద్యోగులను, వినియోగదారులను ఆప్యాయంగా చూచేవాడు కాదు. మరొకటి చిన్న హోటలు. అక్కడ యజమాని ప్రేమగా మాట్లాడి, అందరినీ గౌరవంగా చూసేవాడు. ఒకరోజు భారీ వర్షం వచ్చింది. కరెంటు పోయింది. పెద్ద హోటలు తలుపులు మూసేసింది. చిన్న హోటలు యజమాని మాత్రం కొవ్వొత్తులు వెలిగించి ఆకలితో వచ్చిన వారికి వేడిగా భోజనం పెట్టాడు. కాలక్రమేణా ప్రజలు పెద్ద హోటలు కంటే చిన్న హోటలుకే ఎక్కువగా వెళ్లసాగారు. ఎందుకంటే వారికి కావలసింది ఆడంబరం కాదు… ఆప్యాయత. అందుకే.. “మనసుతో ఇచ్చినది చిన్నదైనా గొప్పదే” అని పెద్దలు చెపుతారు.

కొన్ని సంస్థలు ఉనికిలో చిన్నవే కావచ్చు, పరిమిత వనరులు కలిగియుండవచ్చు. అయినా ఉద్యోగులను గౌరవంగా చూస్తాయి, పారదర్శకత పాటిస్తాయి, వినియోగదారుల నమ్మకంను నిలబెడతాయి. అలాంటి సంస్థలలో ఉద్యోగులు, వినియోగదారులు భద్రతను ఆస్వాదిస్తారు. అలాంటివే విదురుని మందిరాలకు ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. కొన్ని సంస్థలు దుర్యోధనుని భవనం లాంటి ఆడంబరంతో కనిపించవచ్చు. కానీ అంతరంగం మాత్రం డొల్లతనం కనిపిస్తుంటాయి. కృష్ణుడు విలువలును గుర్తించే వ్యక్తి కాబట్టే విదురుని గృహాన్ని ఎన్నుకున్నాడు.

ఈనాడు ప్రతిభావంతులైన చాలామంది ఉద్యోగులు కూడా జీతం మాత్రమే కాదు, అక్కడి యాజమాన్య సంస్కృతి, ఉద్యోగుల మానసిక స్థితి వంటి అంశాలకు ప్రాధాన్యత నిచ్చి తమ సేవలను అందిస్తున్నారు. ఉద్యోగులను గౌరవించని సంస్థలు వెలుపల ఎంత ఆడంబరంగా ప్రకాశించినా లోపల డొల్లతనం బయటపడుతుంది. నిజమైన సంస్థ సంస్కృతి జీతభత్యాలలో కాదు.. ఉద్యోగ యాజమాన్య పరస్పర విశ్వాసంలో ఉంటుంది. నాయకత్వం అధికారంతో కాదు.. ఆప్యాయతతో నిలుస్తుంది. “మనుషుల్ని ఆదరించడం” అనే ధర్మం లేకపోతే విజయం లభించదు.. లభించినా అది అస్థిరమే. ఆడంబరం మనసులను ఆకట్టుకోవచ్చు; కానీ ఆప్యాయత మాత్రమే హృదయాలను గెలుచుకుంటుంది.

పాలకుర్తి రామమూర్తి

Leave a Reply