Andhra Pradesh electricity | విద్యుత్ చౌర్యానికి చెక్

Andhra Pradesh electricity | విద్యుత్ చౌర్యానికి చెక్

Andhra Pradesh electricity | అమరావతి, ఆంధ్రప్రభ : విద్యుత్ నష్టాలను తగ్గించుకొనేందుకు డిస్కంలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి. నష్ట నివారణ చర్యలకు మార్గాలను అన్వేషిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే స్మార్ట్ మీటర్లను అమర్చే పనిలో డిస్కంలు ఉన్నాయి. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల్లో ఏర్పాటు పనులు పూర్తిచేశారు. పరిశ్రమల్లో కూడా వీటిని అమర్చారు. గృహాలకు మాత్రం విడతల వారీగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు.

ఇదిలా ఉండగా విద్యుత్ నష్టాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే స్మార్ట్ మీటర్లు ట్రాన్స్ఫార్మర్ల వద్ద కూడా ఏర్పాటు చేసే పనులు చురుగ్గా సాగుతున్నాయి.

లెక్క పక్కా

ఒక ప్రాంతంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్‌కు స్మార్ట్ మీటర్లు అమర్చడం వల్ల ఆ ప్రాంతంలో సర్వీసుల నుంచి ఎన్ని యూనిట్లు విద్యుత్ వినియోగించారు, ఎంత తేడా ఉంది, నష్టం ఎంత అనే అంశాలను తెలుసుకొనే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

అలాగే ఆ ప్రాంతంలో సర్వీసుల మొత్తం వినియోగం, మీటర్‌లో చూపించే యూనిట్ల సంఖ్యతో పాటు 3 శాతం లైన్ నష్టం కాకుండా ఇంకా ఎక్కువ యూనిట్లు వ్యత్యాసం చూపిస్తే ఆ ప్రాంతంలో విద్యుత్ చౌర్యం జరుగుతుందనే విషయం అధికారులకు తెలుస్తోంది. దీంతో ఎక్కడ చౌర్యం జరుగుతుందనే అంశంపై వారు తనిఖీలు చేపట్టి దానిని నివారించే అవకాశం కూడా ఏర్పడుతోంది. విద్యుత్తు పొదుపు, అక్రమ కనెక్షన్లను గుర్తించేందుకు ఈ విధానం దోహదం చేస్తుందని విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు.

ఇప్పటికే ప్రభుత్వ, వాణిజ్య సర్వీసులకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు 24 గంటల విద్యుత్తు సరఫరా ఫీడర్ల పరిధిలోని ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఏర్పాటు చేస్తున్నారు.

డిస్కం పరిధిలో 60 శాతం పనులు పూర్తి

ఏపీసీపీడీసీఎల్ పరిధిలో ఇప్పటికే 60 శాతం మేర స్మార్ట్ మీటర్ల బిగింపు పనులు పూర్తయ్యాయి. మొత్తం 10,33,462 సర్వీసులకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ ముగిసింది. వీటిలో ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు 78,895 ఉండగా, వాణిజ్య సముదాయాలు 4,52,094 ఉన్నాయి. 29,525 పరిశ్రమలకు కూడా స్మార్ట్ మీటర్లు అమర్చగా, 4,23,892 గృహాలకు కూడా ఏర్పాటుచేశారు. మొత్తంగా 60 శాతం మేర లక్ష్యాలను సాధించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. త్వరలోనే నూరు శాతం స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేస్తామని, ఈ ప్రక్రియ వల్ల వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. పూర్తిస్థాయిలో వీటిని ఏర్పాటుచేసి లైన్ లాసెస్‌ను మరింత తగ్గించేదిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Leave a Reply