Bhatti Vikramarka | ప్రజాసేవలో భట్టి విక్రమార్క నిబద్ధత మరియు పోరాటం

Bhatti Vikramarka | ప్రజాసేవలో భట్టి విక్రమార్క నిబద్ధత మరియు పోరాటం

Bhatti Vikramarka | పీపుల్స్ మార్చ్ పాదయాత్ర: చారిత్రాత్మక ప్రజా ఉద్యమం
ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాస్వామ్య రక్షణ పోరాటాలు
కరోనా కాలంలో భట్టి చూపిన సేవా భావం
పాలకుడిగా భట్టి విక్రమార్క నాయకత్వం మరియు బాధ్యత

Bhatti Vikramarka | న్యాయాత్పథః ప్రవిచలంతి పదం న ధీరా?”.. నిజమైన ధీశాలురు, నిబద్ధత గల నాయకులు ధర్మ మార్గం, న్యాయపథం నుంచి ఒక్క అడుగు కూడా పక్కకు జరగరు. తెలంగాణ రాజకీయ యవనికపై గత దశాబ్ద కాలంగా సాగిన పరిణామాలను పరిశీలిస్తే, ఈ సూక్తికి సజీవ సాక్ష్యంగా నిలుస్తారు మల్లు భట్టి విక్రమార్క. ఒక నిశ్శబ్ద విప్లవంలా, నిలకడైన పోరాట పంథాతో ప్రజా హృదయాలను గెలుచుకున్న నాయకుడాయన. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2023 వరకు ప్రజాపక్షాన నిలిచి ఆయన పోరాడిన తీరు తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా చెప్పుకోవాలి. సభా వేదికలపై సునిశిత విమర్శలు, వీధి పోరాటాలలో పట్టుదల, పల్లెపల్లెకూ నడిచిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర.. ఇవన్నీ ఆయనను కేవలం ఒక పార్టీ నాయకుడిగా కాకుండా, ప్రజా సమస్యల పరిష్కార కర్తగా నిలబెట్టాయి.

ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్ల పోరాటంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాలకుల వ్యూహాత్మక అణిచివేతలను, నిరంకుశ నిర్బంధాలను ఎదిరిస్తూ, ప్రజాస్వామ్య రక్షణే పరమావధిగా ఆయన సాగించిన పోరాటం ఒక చారిత్రాత్మక అధ్యాయం. ఆ పదేళ్ల కాలంలో ఆయన చేసిన ప్రజాపోరాటాలు, రైతు యాత్రలు, ఆసుపత్రుల పర్యటనలు చివరగా మండుటెండలను సైతం లెక్కచేయకుండా చేసిన సుదీర్ఘ పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో చూసిన ప్రజల కష్టాలు.. అధికారంలోకి వచ్చాక చేస్తున్న పరిష్కారాలు ఆయనను విశ్వసనీయ నాయకుడిగా నిలబెట్టాయి. పాదయాత్రలో మాటిచ్చిన రెండు గదుల ఇందిరమ్మ ఇళ్లు, రూ.500 వంట గ్యాస్, రూ.10 లక్షల వరకూ ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు, రూ.2 లక్షల రైతు రుణమాఫీ, ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం.. ఇలా ఎన్నో హామీలు నేడు ఆచరణరూపం దాల్చాయి.

ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భట్టి విక్రమార్కకు అగ్నిపరీక్షలు ఎదురయ్యాయి. విపక్ష ఎమ్మెల్యేలను అధికార పక్షం విలీనం చేసుకుంటున్న తరుణంలో ప్రజాస్వామ్య విలువల్ని కాపాడటానికి ఆయన ఎంచుకున్న మార్గం గాంధేయ వాదం. 2019 జూన్ 8న హైదరాబాద్ ధర్నా చౌక్ వేదికగా చేపట్టిన 36 గంటల సత్యాగ్రహ దీక్ష రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది.

విపత్కర వేళల్లో తోడు.. నీడ

కరోనా మహమ్మారి కరాళనృత్యం చేసిన 2020లో లాక్‌డౌన్ ఆంక్షల మధ్య కూడా భట్టి విక్రమార్క విశ్రమించలేదు. వలస కార్మికుల కన్నీళ్లు తుడవడానికి ధైర్యంగా ముందుకు కదిలారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు జరగక అల్లాడుతున్న రైతుల కోసం క్షేత్రస్థాయిలో నిలిచారు.

2014 నుంచి 2018 మధ్య కాలంలో ప్రతిపక్ష ఉపనేతగా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా భట్టి పార్టీ గొంతుకయ్యారు. ముఖ్యంగా దళిత గిరిజన వర్గాల హక్కుల పరిరక్షణకు ఆయన చేసిన పోరాటం సభలో ప్రస్పుటించింది. రైతుల ఆత్మహత్యలు, కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న పల్లెలు, రుణమాఫీ లబ్ది అందక కుదేలైన అన్నదాతల తరఫున ఆయన అసెంబ్లీలో గళమెత్తారు. 2015-17 మధ్య కాలంలో ప్రభుత్వంపై ఆయన తెచ్చిన ఒత్తిడి పాలకులను అష్టదిగ్బంధనం చేసింది. 2018 ముందస్తు ఎన్నికల వేళ నోటిఫికేషన్లు, దళిత గిరిజన సబ్లాన్ నిధుల మళ్లింపు, అర్హులకు చేరని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వంటి ప్రాథమికాంశాలపై ఆయన క్షేత్రస్థాయి పోరాటాలను నడిపించారు.

ప్రజాస్వామ్య విలువలకు పట్టుగొమ్మగా.. 2019 జనవరిలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా రైతులకు భరోసా ఇవ్వడానికి పర్యటనలు చేశారు. 2021లో కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులను ముందుకు నడిపించారు. 2022లో ప్రకృతి వైపరీత్యాల వల్ల, వరదల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించి తక్షణ పరిహారం కోసం క్షేత్రస్థాయి నుంచి పాలకులను నిలదీశారు.

‘పీపుల్స్ మార్చ్’ ఓ చరిత్ర..
భట్టి విక్రమార్క రాజకీయ ప్రస్థానంలో మకుటాయమానంగా నిలిచింది “పీపుల్స్ మార్చ్” పాదయాత్ర. 2023 మార్చి 16న ఆదిలాబాద్‌లోని బోథ్ నియోజకవర్గం పిప్పిరి గ్రామంలో మొదలైన ఈ బృహత్తర కార్యక్రమం తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. 46 డిగ్రీల మండుటెండల్లో ఏకబిగిన 108 రోజుల పాటు అలుపెరగని యాత్రను కొనసాగించారు. 17 జిల్లాల మీదుగా 1,364 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 2 జులై 2023న ఖమ్మంలో జరిగిన చారిత్రాత్మక భారీ బహిరంగ సభతో పాదయాత్ర ముగిసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి నాంది పలికింది.

నాయకత్వ పరిణితి
విమర్శల్లో పదును, ప్రశ్నించడంలో హుందాతనం, ప్రజల పక్షాన మాట్లాడడంలో స్పష్టత.. ఇది భట్టి విక్రమార్క ప్రత్యేక శైలి. హుందాగా, ధీమాగా రాజకీయాలు చేయడంలోనూ విక్రమార్కది విలక్షణ శైలి. ఒకప్పుడు అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రశ్నించిన గొంతుక, నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, కీలకమైన ఆర్థిక, విద్యుత్ శాఖల సారధిగా సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. భూసేకరణ బాధిత రైతుల పక్షాన నిలబడి వారి భూమి హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన ఆయన, నేడు పాలకుడిగా అదే అణగారిన వర్గాలకు న్యాయం చేసే బాధ్యతను భుజాన వేసుకున్నారు.

2014 నుంచి సాగిన పదేళ్ల ప్రయాణాన్ని విశ్లేషిస్తే, భట్టి విక్రమార్క ఒక రాజకీయ నేత కంటే ప్రజా పక్షపాతిగా ఎదిగి ప్రజల నమ్మకాన్ని ఎలా చూరగొన్నారో అర్థమవుతుంది. నిరంతరం ప్రజాసేవలోనే తరిస్తూ, అధికారంలో ఉన్నా లేకున్నా క్షేత్రస్థాయి శ్రామికుడిగా నిలిచిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ.. ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

చామిరాజు శేషుబాబు

డిప్యూటీ సీఎం పీఆర్ఎ