Hyderabad Metro Rail | మెట్రో నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ కొత్త వ్యూహం

Hyderabad Metro Rail | మెట్రో నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ కొత్త వ్యూహం
Hyderabad Metro Rail | ఎల్ అండ్ టీతో ఒప్పందం తర్వాత కీలక పరిణామాలు
ప్రైవేట్ సంస్థలకు మెట్రో బాధ్యతల అప్పగింత
ఫేజ్-1 ఆస్తుల విలువపై ప్రభుత్వ అంచనాలు
మెట్రో నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు
Hyderabad Metro Rail | హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో: హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను మరో ప్రైవేట్ సంస్థకు అప్పగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నిర్ణయం గతంలో తీసుకున్నదే అయినప్పటికీ, ఆసక్తితో ఉన్న సంస్థలను ఆహ్వానించడం, వారితో సంప్రదింపులు జరపడం లాంటి ప్రక్రియలో ఆలస్యం జరిగింది.
ఈ ప్రాజెక్టును నిర్మించిన సంస్థ ఎల్ అండ్ టీ ప్రభుత్వానికి సహకరించని నేపథ్యంలో స్వాధీనం చేసుకున్నప్పటికీ, ప్రభుత్వరంగంలో నిర్వహణ చాలా కష్టసాధ్యమైనది అని నిపుణుల కమిటీ నివేదిక తేల్చినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆసక్తితో ఉన్న అనేక సంస్థలు అంతర్గతంగా ముఖ్యమంత్రితో, ఇతర ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపాయి.
ఫేజ్-1 నెట్‌వర్క్ ఆస్తులు సరాసరిగా రూ.1461.67 కోట్లుగా అంచనా వేశారు. ఈ ఆస్తుల్లో అగ్రభాగం వాణిజ్య సముదాయాలే ఉన్నాయి. ఈసారి బహుళజాతి సంస్థలకు అప్పగించకుండా దేశీయ సంస్థలకు అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
గడిచిన ఏప్రిల్ నెలాఖరుతో టేకోవర్ ప్రక్రియ దాదాపు పూర్తయింది. మెట్రోరైలు నిర్మాణం కోసం ఎల్ అండ్ టీ సంస్థ తీసుకున్న రూ.13 వేల కోట్ల రూపాయల రుణం చెల్లింపు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. మరో రెండు వేల కోట్ల రూపాయలను ఎల్ అండ్ టీకి ప్రభుత్వం ఈక్విటీగా చెల్లించేలా ఒప్పందం కుదిరింది. ఈ చెల్లింపుల ప్రక్రియ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు.
మూడు లైన్లుగా సేవలందిస్తున్న మెట్రో మొదటి దశ:
రెడ్ లైన్: మియాపూర్ నుండి ఎల్బీనగర్ (29.87 కి.మీ) – 27 స్టేషన్లు
బ్లూ లైన్: నాగోల్ నుండి రాయదుర్గం (27 కి.మీ) – 24 స్టేషన్లు
గ్రీన్ లైన్: జూబ్లీ బస్టేషన్ నుండి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (11.2 కి.మీ) – 10 స్టేషన్లు
ప్రభుత్వం మెట్రో రైలును సమర్థవంతంగా నిర్వహించే అవకాశాలపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 అనేది 57 స్టేషన్లతో మూడు కారిడార్లలో 69.2 కి.మీ విస్తరించి ఉన్న 1.8 బిలియన్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఇది పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ మోడల్లో అభివృద్ధి చేసిన దేశంలోని అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్‌లలో ఒకటిగా నిలిచింది. ప్రతిరోజూ సరాసరిగా ఐదున్నర లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. ప్రాజెక్ట్ నెట్‌వర్క్ కారిడార్లలో ఫేజ్-1 నెట్‌వర్క్‌ను పూర్తిగా ఎలివేట్ చేశారు.
