ఎస్టీ బాలికల హాస్టల్‌లో 27 మంది విద్యార్థినులు అస్వస్థత
ఆహారం వికటించిందా?.. ఆస్పత్రిలో చికిత్స
వర్ధన్నపేట, ఆంధ్రప్రభ: వర్ధన్నపేటలోని ఎస్టీ బాలికల హాస్టల్‌లో 27 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో వారిని సోమవారం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం ప్రకారం, ఆదివారం విద్యార్థినులు చికెన్‌తో భోజనం చేసిన అనంతరం సాయంత్రం నుంచి కొందరికి విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో హాస్టల్ సిబ్బంది అప్రమత్తమై సోమవారం ఉదయం వారిని ఆస్పత్రికి తరలించారు.
వైద్యుల సమాచారం ప్రకారం, 27 మంది విద్యార్థినుల్లో ఎనిమిది మందికి కడుపునొప్పి ఉండగా, ఇద్దరిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. మిగిలిన వారికి చికిత్స కొనసాగుతోంది.
విద్యార్థినుల అస్వస్థతకు ఆహారం వికటించడమే కారణమా అనే అంశంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.
