Adilabad | బోసిపోయిన పత్తి మార్కెట్..!

Adilabad | బోసిపోయిన పత్తి మార్కెట్..!
ఈ రోజు ప్రారంభమైన జిన్నింగ్ వ్యాపారుల సమ్మె
Adilabad | ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : జిన్నింగ్ మిల్లుల (Cotton Mills) పై కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) (CCI) నిబంధనలు తొలగించాలనే డిమాండ్ తో రాష్ట్ర వ్యాప్తంగా కాటన్ మిల్లుల అసోసియేషన్ ఈ రోజు నుండి సమ్మె ప్రారంభించి పత్తి కొనుగోల్లు నిలిపివేసింది. సీసీఐ విధించిన ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 నిబంధనలు తొలగించాలని, నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్లులన్నింటికీ పత్తి కొనుగోళ్లకు అవకాశం ఇవ్వాలని జిన్నింగ్ మిల్లుల వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు.

పత్తి కొనుగోళ్లు (Cotton purchases) నిలిపివేయడంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ కాటన్ మార్కెట్ యార్డులు బోసిపోయాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ పిలుపు విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ మద్దతు ధర రూ. 8,110 ప్రకటించినప్పటికీ, 8 నుండి 12 శాతం లోపు పత్తిలో తేమ ఉంటేనే సీసీఐ కొనుగోళ్లకు మెలిక పెట్టిన విషయం తెలిసిందే. ఎకరాకు రైతు పండించిన ఏడు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే సీసీఐ కొనుగోలు చేయడంపై మరోవైపు రైతులు ఆందోళన చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో 33 జిన్నింగ్ మిల్లుల బంద్..
జిన్నింగ్ వ్యాపారుల బంద్ పిలుపు నేపథ్యంలో ఈ రోజు 33 జిన్నింగ్ మిల్లులు కొనుగోలు చేపట్టక మూతపడ్డాయి. మార్కెటింగ్ అధికారులు సైతం సమ్మె దృష్ట్యా స్లాట్ బుకింగ్ నిలిపివేస్తున్నట్టు, పత్తి సరుకు మార్కెట్ కు తీసుకురావద్దని మూడు రోజుల ముందుగానే పిలుపునిచ్చిన నేపథ్యంలో రైతులు పత్తి బండ్లను తీసుకురాలేదు. దీంతో పత్తి బండ్లు లేక మార్కెట్ యార్డ్ (Market Yard) బోసిపోయింది. ఇక ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 17 జిన్నింగులు నోటిఫై చేసినప్పటికీ కేవలం 4 మిల్లులోకి మాత్రమే సీసీఐ అనుమతించింది. దీంతో మిగతా జిన్నింగ్ మిల్లుల యజమానులు సీసీఐ వైఖరిని నిరసిస్తూ సమ్మెలో పాల్గొంటున్నారు. సీసీఐ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 నిబంధన ఎత్తివేసే వరకు పత్తి కొనుగోలు నిలిపివేస్తున్నట్టు జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షులు రాజు చింతావార్ తెలిపారు.
అఖిలపక్షం ధర్నా..!
పత్తిలో తేమశాతం ఆంక్షలు లేకుండా బేషరతుగా పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Cotton Corporation of India) ఆదిలాబాద్ కార్యాలయం ఎదుట అఖిలపక్షం కమిటీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. పత్తిలో సహజసిద్ధంగానే తేమశాతం 20 పైన ఉంటుందని, తేమ శాతం నిబంధన తొలగించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. పరిమిత కొనుగోళ్ల ఆంక్షలు కూడా తొలగించాలని వారు కోరారు. ధర్నాలో సీపీఎం, సీపీఐ రైతు సంఘాలు పాల్గొన్నాయి.
